సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 16మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇబ్రహీంపట్నంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బోటు తిరగబడిన సమయంలో అందులో సుమారు 38 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
చీకటి పడుతుండటంతో శక్తిమంతమైన లైట్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భవాని ఐలాండ్ కు వెళ్లిన బోటు తిరిగి పవిత్ర సంగమం ఘాట్‌కు వస్తున్న సమయంలో ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బోటు బోల్తా పడిన ప్రదేశంలో 20 అడుగుల వరకూ లోతు ఉండొచ్చని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లు అందరూ బోటులోని వారిని రక్షించేందుకు వెళ్లినట్లు తెలిసింది. బోటు ఓవర్ లోడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఇంతియాజ్ బాషా సాక్షితో చెప్పారు.
గజ ఈతగాళ్లు మరో నలుగురిని రక్షించి, ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు ఒంగోలుకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు కూడా ఘటనాస్థలికి బయల్దేరారు. పడవ ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పడవ ప్రమాదంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
కృష్ణా నదిలో ప్రమాద అనంతరం దృశ్యాలు
Comments
Please login to add a commentAdd a comment