అనంతపురం రూరల్: బోగస్ రేషన్ కార్డులను ఏరిపారేయాలని, ప్రతి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని మంత్రి పరిటాల సునీత అధికారులను సూచించారు.
అనంతపురం రూరల్: బోగస్ రేషన్ కార్డులను ఏరిపారేయాలని, ప్రతి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని మంత్రి పరిటాల సునీత అధికారులను సూచించారు. మంత్రి తన నివాసంలో శనివారం డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. బోగస్ కార్డుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందన్నారు.
ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నూతనంగా 37,053 రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. 9,97,368 కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు. మిగిలినవాటిని అనుసంధానం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విద్యార్థులకందించే మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు విద్యార్థుల అన్నాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ప్రత్యేక బ్యాగుల ద్వారా నాణ్యమైన బియ్యం అందజేయాలని ఆదేశించారు.
80 వేల పెన్షన్ల పునఃపరిశీలన : ప్రస్తుత నిలుపుదలలో ఉన్న 80 వేల పెన్షన్ల పునఃపరిశీలన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2.98 లక్షల పింఛన్లనుఅందిస్తున్నామని దీంతో పాటుగా 14,767 పెన్షన్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిందన్నారు. 65 ఏళ్ల వయసు పైబడిన పేదలందరికీ పింఛన్ వర్తిస్తుందన్నారు. పెన్షన్లు తొలగించబడిన వితంతువులందరికీ పునరుద్ధరించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు 3,250 మంది వితంతువుల జాబితాను తయారు చేశామన్నారు. అనర్హులను తొలగించి, అర్హులైన వారికి పెన్షన్లను అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బజారులో వసతుల కల్పనకు రూ 5 లక్షలతో చేపట్టిన పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీకాంత్‌రెడ్డిని ఆదేశించారు. రైతు బజార్‌లో కేవలం నాలుగైదు స్టాల్స్ మాత్రమే నడుస్తున్నాయని, పూర్తి స్థాయిలో రైతులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.