అబ్రక.. దబ్ర! | bogus in tdp membership in thalluru | Sakshi
Sakshi News home page

అబ్రక.. దబ్ర!

Published Fri, Mar 3 2017 3:47 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

అబ్రక.. దబ్ర! - Sakshi

అబ్రక.. దబ్ర!

=     టీడీపీ సభ్యత్వాల్లో మాయ
=     సభ్యత్వాలు ఎక్కువ చూపేందుకు పడరాని పాట్లు  
=     ఏకంగా వైఎస్సార్‌ సీపీ మద్దతు సర్పంచి పేరుతో సభ్యత్వం
=     విషయం తెలిసి అవాక్కైన మన్నేపల్లి సర్పంచి జానకిరెడ్డి
=     పరువు నష్టం దావా వేస్తానంటూ టీడీపీ నేతలకు హెచ్చరిక


తాళ్లూరు : నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు.. జిల్లాలో అధికార పార్టీ నాయకుల తీరు అచ్చం అలాగే ఉంది. హైటెక్‌ సీఎం పాలనలో కాకి లెక్కలు వచ్చి ఉంటే చాలు కాలం గడిపేయవచ్చని మరోసారి నిరూపించారు. పార్టీ అధినేత చంద్రబాబును దగ్గరగా గమనించిన నేతలు ఆయనలాగే వ్యవహరిస్తున్నారు. ఏకంగా పార్టీ సభ్యత్వ నమోదులో కూడా అంకెలు మార్చేశారు. లక్ష్యానికి మించి సభ్యత్వాలు చేసి అధినాయకులతో శభాష్‌..అనిపించుకునేందుకు కనిపించిన గడ్డీ తింటున్నారు. తీరా సభ్యత్వ నమోదులో కార్డులు వచ్చిన తర్వాత లోపాలు చూసి ఆ పార్టీకి చెందిన నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు.

ఓటర్‌ లిస్టు ఆధారంగా సభ్యత్వాలు: జిల్లాలో కొన్నిచోట్ల ఓటర్‌ లిస్టుల ఆధారంగా టీడీపీ సభ్యత్వాలు ఇచ్చేశారు. చివరకు వారి పైత్యం ఎక్కడికి వెళ్లిందంటే వైఎస్సార్‌ సీపీ మద్దతు సర్పంచికి కూడా సభ్యత్వ కార్డు ఇచ్చేశారు. సభ్యత్వ కార్డులు వచ్చిన తర్వాత వాటిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తమ పేర్లతో సభ్యత్వాలు ఇచ్చి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయ వద్దంటూ గ్రామస్థాయి నాయకులు టీడీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఈ వ్యవహారంపై వాదోపవాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుడు దారంవారిపాలేనికి చెందిన మన్నేపల్లి సర్పంచి దారం జానకిరెడ్డికి ఇటువంటి అనుభవం ఎదురైంది. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు సర్పంచినని, తన పేరుతో టీడీపీ సభ్యత్వం ఎలా వచ్చిందంటూ ఆయన ఆరా తీశారు. టీడీపీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరిస్తున్నారు.

కాకి లెక్కలు: దర్శి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాలు దాదాపు 50 వేలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో తాళ్లూరు మండలంలో 9 వేలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కొందరు పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చే ప్రయోజనాల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. టార్గెట్‌ కోసం ఆయా గ్రామాలకు చెందిన నాయకులు ఓటర్‌ లిస్టులను దగ్గర పెట్టుకుని సభ్యత్వాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. చివరకు రుసుం సైతం సంబంధిత నాయకులే భరించినట్లు చెబుతున్నారు. ఇటువంటి లోపాలు అనేకం బయట పడుతుండటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతూ అంతర్గతంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీనిపై తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు షేక్‌ పెదకాలేషావలిని ‘సాక్షి’ వివరణ కోరగా పొరపాటు జరిగి ఉంటుందని సింపుల్‌గా సెలవిచ్చారు.

పరువు నష్టం దావా వేస్తా : పార్టీ మారితే రూ.లక్షలు ఇస్తామని టీడీపీ నాయకులు గతంలో ఎర చూపారు. నాది ఒకే మాట, ఒకే పార్టీ.. అని వారికి తేల్చి చెప్పా. నా అనుమతి లేకుండా టీడీపీ సభ్వత్వం ఇవ్వడం దారుణం. టీడీపీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తా.  – దారం జానకిరెడ్డి, మన్నేపల్లి సర్పంచి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement