పార్టీ సంగతి మీరు .. అధికారుల సంగతి మేము ...
చిత్తూరు: పాలన సంగతి దేవుడెగురు... ముందు పనులు చక్కబెట్టుకుంటే చాలన్నట్లు ఉంది.. అధికార పార్టీ నేతల తీరు. అధికారపార్టీ నేతలను మెప్పించిన అధికారులే ఉంటారని అందుకు ఇష్టపడని అధికారులను సాగనంపుతామని సాక్షాత్తు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బహిరంగంగా చెప్పిన విషయం అందుకు అద్దంపడుతోంది. సోమవారం చిత్తూరులో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ అంశం బయటపడింది. పార్టీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తోపాటు మంత్రి బొజ్జల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అధికారుల బదిలీలపై బహిరంగంగానే ప్రసంగించారు.
ఇక నుంచి మీకు నచ్చిన, మెచ్చిన అధికారులే ఉంటారు.. నచ్చని వారిని సాగనంపుతాం.. అంటూ స్పష్టం చేశారు. నాలుగు నెలల పాలనలో బదిలీలు ఆలస్యమైన మాట నిజమే. ఇక అలా జరగదు. నచ్చని అధికారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇక నుంచి తహశీల్దార్ పలకలేదు... ఎస్‌ఐ మాట వినలేదు... అంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు ఉండకుండా చూస్తామన్నారు. అన్నీ మీరు చెప్పినట్లే చేస్తాం.. మీకు నచ్చిన అధికారులనే ఉంచుతాం. అంటూ మంత్రి తేల్చి చెప్పారు. అధికారుల సంగతి మేము చూసుకుంటాం.. గ్రామాల్లో పార్టీ సంగతి మీరు చూసుకోవాలి అంటూ చెప్పారు. రాబోవు కాలంలో గ్రామాల్లో అధికార సపోర్టుతో టీడీపీకి ఎదురులేకుండా చూడాలని మంత్రి నేతలకు సూచించారు.
ఇప్పటికే జిల్లాలో టీడీపీ నేతలకు అధికారులు పలకడం లేదంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదులందాయని మంత్రి చెప్పారు. ఈ విషయం సీఎం తనతో కూడా చర్చించారన్నారు. అధికారులతో మాట్లాడాలంటూ తనను ఆదేశించినట్లు బొజ్జల బహిరంగంగానే చెప్పారు. నచ్చని అధికారుల జాబితాలు మాకు చేర్చండి. వారిని సాగనంపే విషయం తాను చూసుకుంటానంటూ మంత్రి పాత్రికేయుల సమక్షంలో పార్టీ కార్యాలయంలో చెప్పడం విశేషం. మంత్రి మాటలు విన్న అక్కడ ఉన్న కొందరు అధికారులు ఔరా మంత్రి...! అంటూ ముక్కున వేలేసుకున్నారు.