ప్రాణం తీసిన పేలుళ్లు | bomb blast in kadikella stone quarry one death six injured | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పేలుళ్లు

Published Mon, Nov 13 2017 8:58 AM | Last Updated on Mon, Nov 13 2017 8:58 AM

bomb blast in kadikella stone quarry one death six injured - Sakshi

వీరఘట్టం: మండలంలోని నడిమి కెల్ల పంచాయతీ పరిధిలోని కడకెల్ల రాతి క్వారీలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిన భారీ బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు కూలీల ఆచూకీ కానరావడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరితో పాటు ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఇక్కడ ఏం జరిగిందో నిర్వాహకులు స్పష్టంగా చెప్పకుండా దాచిపెడుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. విషయం తెలుసుకున్న వెంటనే పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాద సమయంలో  20 మంది కూలీలు..
జిల్లాకు శివారులో ఉన్న కడకెల్ల పొలిమేరల్లో జి.ఎస్‌.ఆర్‌.స్టోన్‌క్రషర్‌కు అనుసంధానంగా రాతి క్వారీ ఉంది. ఇక్కడ ఆదివారం సాయంత్రం బాంబు బ్లాస్ట్‌ జరిగింది. రాతి కొండపై పెద్ద పెద్ద రాళ్లను పేల్చేందుకు కొండ రంధ్రాల్లో ప్రమాదకర మందుగుండి అమర్చి బ్లాస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చిందని సమీపంలో ఉన్న వారు చెబుతున్నారు. ఈ సమయంలో సుమారు 20 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న జగ్గురోతు రామారావు(23) మృతి చెందాడు. భారీ రాళ్ల మధ్య ఈయన మృతదేహాన్ని గుర్తించారు.మరో ఇద్దరు కూలీలు కూడా రాళ్ల మధ్య ఇరుక్కున్నట్లు పలువురు చెబుతున్నారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అనుమతి లేకుండానే..
స్టోన్‌ క్రషర్‌కు అనుమతులు ఉన్నాయే తప్ప సమీపంలో ఉన్న రాతి క్వారీలో పేలుళ్లు చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ ప్రతి రోజూ ఇక్కడ ప్రమాదకర మందుగుండుతో బ్లాస్టులు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక రైతులు కలెక్టర్, అధికారులందరికీ ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ నిండుప్రాణం బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులు వీరే...
ఈ ప్రమాదంలో జగ్గురోతు రామారావు(23) మృతి చెందగా, జగ్గురోతు చంద్రరావు, జగ్గురోతు స్వామినాయుడు, మోపాడ సూరిబాబు, జగ్గురోతు అప్పలనాయుడు, ఆబోతుల పకీరునాయుడు, బ్లాస్టర్‌ శివ గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆబోతులపేటకు చెందిన మృతుడు రామారావు తన అన్నదమ్ములు చంద్రరావు,స్వామినాయుడుతో కలసి ఏడాది నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. వీరితోపాటు పడిన వారంతా వలస కూలీలుగా ఉన్నారు.

అంతా గోప్యం..
క్వారీలో ఆదివారం ఏం జరిగిందనే విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. విషయం తెలిసిన వెంటనే వీరఘట్టం ఎస్‌ఐ జి.అప్పారావు, సీఐ సూరినాయుడు, డిప్యూటీ తహసీల్దార్‌ సుందరరావు, ఆర్‌ఐ సన్యాసిరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చీకటిగా ఉండటంతో నిర్వాహకులు పూర్తిగా విద్యుత్‌ దీపాలను సంఘటనను దాచివేసే ప్రయత్నం చేశారు. బ్లాస్టు చేసే వ్యక్తికి కూడా ఎటువంటి అనుభవం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఇంతలో పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటన స్థలానికి వచ్చి నిర్వాహకులను ప్రశ్నించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలిసిన ఏకైక వ్యక్తి బ్లాస్టర్‌ శివ. పేలుడు జరిగిన వెంటనే ఈయన పరారవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆబోతులపేటలో విషాదం...
క్వారీ పేలుల్లో మృతిచెందినట్లు భావిస్తున్న వ్యక్తి రామారావుది జి.సిగడాం మండలం ఆబోతులపేట. విషయం తెలిసిన వింటనే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు క్వారీ వద్దకు చేరకుని బోరున విలపించారు. ఈ నెల 16న తన కుమార్తె వెన్నెల పుట్టిన రోజు ఉంది. ఇంటికి వస్తానని చెప్పిన భర్త అంతలోనే మృతి చెందడంతో భార్య రూపావతి బోరున విలపించింది.

దర్యాప్తు చేస్తాం..
ప్రస్తుతం క్వారీలో ప్రమాదకర బాంబులు అమర్చినట్లు తెలిసింది. బాంబు స్క్వాడ్‌ వచ్చి పరిశీలించిన తర్వాత దర్యాప్తు చేపట్టి నిజాలు బయటపెడతాం. తెల్లవారితేగాని మృతులు ఎంత మందో చెప్పలేం. నిర్వాహకుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. – స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement