జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు | Bone oil sales heavily | Sakshi
Sakshi News home page

జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు

Published Mon, Nov 24 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు

జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు

పలమనేరు: జిల్లాలో బోన్ ఆయిల్ పేరిట జంతువుల ఎముకలతో తయారు చేసిన నూనె విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. సాధారణ వంట నూనెల్లోనూ ఈ ఆయిల్‌ను కలిపి తక్కువ ధరకే కొందరు అమ్ముతున్నారు. లోకల్ డాల్డా పేరిట చిన్నచిన్న హోటళ్లకు ఈ నూనెను రిటైల్‌గా విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎముకల సేకరణ కేంద్రాలు భారీగా ఉన్నాయి. కొందరు ఏజెంట్లు ఈ ఎముకలను సరిహద్దులోని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి బోన్‌ఆయిల్‌ను ఇక్కడికి చేరవేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన ఆహారకల్తీ నియంత్రణ శాఖ అసలు పట్టించుకోవడం లేదు. బోన్ ఆయిల్‌తో తయారుచేసిన పదార్థాలు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే.
 
పలుచోట్ల ఎముకల సేకరణ కేంద్రాలు
జంతువుల ఎముకలను సేకరించి ఎండబెట్టి కొందరు తమిళనాడులోని ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. పలమనేరు పట్టణ సమీపంలోని గడ్డూరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ ఇంట్లో ప్రస్తుతం ఎముకల సేకరణ భారీగా సాగుతోంది. ఈ ఇంటి ఆవరణలో ఎటువైపు చూసినా జంతువుల క బేళాలు, ఎండబెట్టిన ఎముకలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఇలాంటి ఎముకల సేకరణ కేంద్రాలు వి.కోట, చిత్తూరు, పుత్తూరు, మదనపల్లె, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతోంది. ఇలా సేకరించిన ఎముకలను అక్రమంగా తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం, పేర్నంబట్, ఆంబూర్ తదితర ప్రాం తాలకు తరలిస్తున్నారు. వీటితో అక్కడ ఈ బోన్‌ఆయిల్‌ను తయారు చేస్తున్నారు.
 
వంట నూనెల్లో బోన్ ఆయిల్ కల్తీ
బోన్ ఆయిల్‌ను ఐదు లీటర్లు, పది లీటర్ల క్యాన్ల లో నింపి అమ్ముతున్నారు. వంట నూనెల్లోనూ కల్తీ చేసి రకరకాల కంపెనీ ప్యాకెట్లుగా తయారుచేస్తున్నారు. మరోవైపు లూజ్ డాల్డా పేరిట ఎముకల నూనెను కలిపి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎముకలు తీసుకెళ్లే ఏజెంట్లే వచ్చేటపుడు అక్కడి నుంచి ఈ బోన్ ఆయిల్‌ను ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నూనె భలే చీప్..
స్థానికంగా వేరుశెనగ నూనె లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ కంపెనీ బ్రాండ్‌ను బట్టి లీటర్ రూ.80 నుంచి 100 దాకా దొరుకుతోంది. డాల్డా, పామోలిన్ రూ.60 వరకు అమ్ముతున్నారు. ఈ బోన్ ఆయిల్ కల్తీచేసిన నూనె లీటర్ రూ.30కే దొరుకుతోంది. దీంతోపాటు డాల్డా, పామోలిన్ రూ.20 లకే అమ్ముతున్నారు. తక్కువ ధరకే దొరుకుతోం దన్న ఆశతో పలువురు వీటిని కొనుగోలుచేసి ఉపయోగిస్తున్నారు.
 
లోకల్ డాల్డా పేరిట హోటళ్లకు విక్రయాలు
తమిళనాడుకు చెందిన కొందరు ఏజెంట్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిన్నహోటళ్లకు  బోన్‌ఆయిల్‌ను సరఫరా చేస్తున్నారు. లోకల్‌డాల్డా పేరిట బహిరంగంగానే విక్రయిస్తున్నారు. దానికి తోడు ముందుగా సరుకిచ్చి వారం తర్వాత డబ్బులు తీసుకెళ్తున్నారు. దీంతో హోటల్ వ్యాపారులు సైతం ఈ నూనె కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
 
అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే
బోన్‌ఆయిల్ లేదా కల్తీ చేసిన నూనెలతో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు రావడం, ఆపై చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతోందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి నూనెలతో జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరమని ైవె ద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఒబెసిటి లాంటి వ్యాధులు కూడా రావచ్చని చెబుతున్నారు.
 
పట్టించుకోని ఫుడ్ సెఫ్టీ విభాగం
ఆహార పదార్థాల కల్తీని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు కల్తీ నూ నెల వ్యవహారాన్ని అసలు పట్టించుకోవడం లే దు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పట్టణాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీల్లోని అధికారులు ఈ కల్తీ గురించి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్లకు సోదాలు చేసే అధికారం లేకపోవడమూ ఓ కారణంగా మారింది.

ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం తగ్గడం లేదు. దీనిపై ఆహా ర కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై చిత్తూరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా తమకు ఇంతవరకు ఈ విషయం తెలీదని, వెంట నే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement