భారీగా పడిన ముడిచమురు ధర
50 డాలర్లకు పతనం
న్యూయార్క్: అంతర్జాతీయంగా ముడిచమురు ధర అంతకంతకూ తగ్గుతోంది. చమురు విక్రయాలపైనే ఆధారపడ్డ దేశాలకు చెమటలు పట్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో నెమైక్స్ క్రూడ్ ధర దాదాపు 5-6 శాతం తగ్గిపోయింది. దీంతోబ్యారెల్ ధర 50 డాలర్లను తాకింది. 2009 ఏప్రిల్ తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.
2014 జూన్ నుంచి చూస్తే క్రూడ్ ధర దాదాపు 50 శాతం తగ్గింది. చైనా సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితి, జపాన్‌లో మాంద్యం, యూరో జోన్‌లో వృద్ధి నిలిచిపోవడం, అధిక నిల్వలు, మార్కెట్‌పై పట్టుకు సంబంధించి అంతర్జాతీయంగా అమెరికా, ఒపెక్ సహా వివిధ చమురు ఉత్పత్తి దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని కేంద్రం సామాన్యుడికి అందించటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.