సహకార రంగానికి ఊతం | Boost to the Cooperative sector | Sakshi
Sakshi News home page

సహకార రంగానికి ఊతం

Published Mon, Jul 22 2019 3:28 AM | Last Updated on Mon, Jul 22 2019 3:28 AM

Boost to the Cooperative sector - Sakshi

సాక్షి, అమరావతి: సహకార రంగానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతికి దోహదపడే ఈ రంగం మోడువారకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, చక్కెర కర్మాగారాల్లోని పరిస్థితుల అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని దశల వారీగా వీటిని పునరుద్ధరించనున్నారు. తొలిదశలో రెండు కర్మాగారాల పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష జరగనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

నష్టాల ఊబిలో కర్మాగారాలు
ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులు పెరగడం, గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో సహకార రంగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పది చక్కెర కర్మాగారాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. రేణిగుంటలోని ఎస్‌వీ కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లాలోని జంపని షుగర్‌ ఫ్యాక్టరీ, వైఎస్సార్‌ జిల్లాలోని కడప కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, విజయనగరం జిల్లాలోని భీమ్‌సింగ్‌ కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన చెరుకు రైతులు, రైతు కూలీలు, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, చోడవరం కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, తాండవ కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ ఉత్పాదక రంగంలో కొనసాగుతున్నాయి. చక్కెర కర్మాగారాలకు వాటిల్లిన నష్టాలు.. అవి ప్రభుత్వానికి, ఆర్థిక సంస్థలు, ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తాలు దాదాపు రూ. 1,475 కోట్లు ఉన్నాయి. కర్మాగారాలకు వచ్చిన నష్టాలు రూ. 683 కోట్లు, ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 271.14 కోట్లు, ఆప్కాబ్, ఎన్‌సీడీసీల నుంచి తీసుకున్న అప్పులు రూ. 416.58 కోట్లు, ఉద్యోగుల జీతాల బకాయిలు రూ. 105 కోట్లు ఉన్నాయి.

భారమైనా ఈ రంగాన్ని బతికించాలని...
ప్రస్తుత పరిస్థితిలో చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించినా, భవిష్యత్‌లో అవి లాభాల బాటలో కొనసాగే పరిస్థితులు లేవు. ఏటా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. అయితే భారమైనా ఈ రంగాన్ని బతికించాలని, ఆయా కర్మాగారాలు ఉత్పాదక రంగంలో కొనసాగితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అక్కడి రైతులు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌ వీటికి దశల వారీగా నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని కడప కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను తొలిదశలో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిగా సొంత జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో డిసెంబరులోపు అక్కడి కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్‌లో దాదాపు రూ. 100 కోట్లు కేటాయించారు.

పాడి రైతులకు లీటరుకు రూ. 4 బోనస్‌ 
ప్రైవేట్‌ డెయిరీల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు మూతపడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను తెరిపించి, రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ. 4లను బోనస్‌గా ఇస్తానని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 100 కోట్లు కేటాయించారు. ఒక ఏడాదిలోపు ఇవన్నీ సక్రమంగా నడిచే విధంగా చర్యలు తీసుకుని, ఆ తరువాత రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement