సాక్షి, కర్నూలు : జిల్లాలో గాడితప్పిన పాలనను పట్టాలు ఎక్కించి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి జిల్లా సమీక్ష కమిటీ(డీఆర్‌సీ) సమావేశాలు జరగకపోవడంతో అధికారులు గాడి తప్పారన్నారు. ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మున్ముందు ఇలా జరిగితే తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను తెలుసుకుని, జిల్లా సమగ్రాభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసన మండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, చెన్నకేశవరెడ్డి, జె.సుధాకర్, హఫీజ్‌ఖాన్, ఆర్థర్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో 10 రోజుల్లో సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. తాగు, సాగునీటి సమస్యలపై పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా రిజర్వాయర్లు, ఎస్‌ఎస్ ట్యాంకులు, చెరువులను నింపుకోవాలని అధికారులకు సూచించారు. నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ సంబంధిత భూముల షేర్ హోల్డర్లపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సీఐడీ విచారణ వేయాలని మంత్రి బుగ్గన కోరగా.. ఆయన అంగీకారం తెలిపి తీర్మానం చేశారు.
ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోండి
జిల్లా అధికారులు.. ప్రజాప్రతినిధులకు అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారాన్ని అందించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. ఇంతవరకు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని, ఇకమీదట ఎలాంటి పనులకైనా నిధులు విడుదల అవుతాయని చెప్పారు. పెండింగ్ పనులకు నిధులను విడుదల చేయించుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. ఓర్వకల్ మండలంలోని సోలార్ పార్కులకు ఇచ్చిన భూముల్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పరిహారం కాజేశారని, వీటిపై క్షుణ్ణంగా విచారణ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
‘వాటర్ గ్రిడ్’ సమర్థవంతంగా అమలు చేయాలి
వాటర్ గ్రిడ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ నీటి కొరత ఉండదని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలని ఇన్‌చార్జ్ మంత్రిని కోరారు. అలాగే 35 వేల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని ఆలూరు నియోజకవర్గానికి సరఫరా చేయాలని వ్యవసాయశాఖ జేడీ ఆనంద్‌నాయక్‌ను ఆదేశించారు. శాసనమండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌బీసీ కాలువ ద్వారా అలుగనూరు రిజర్వాయర్‌ను నింపాలని కోరారు.
ఆళ్లగడ్డలో గుండ్ల వాగును పటిష్టం చేస్తే రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని..సమీపంలోని ఆయకట్టును స్థీరికరించవచ్చన్నారు. నంద్యాల–రామకృష్ణాపురం మధ్య పెండింగ్‌లో ఉన్న రహదారిని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. చాగలమర్రిలో అన్యక్రాంతమైన భూములను పరిరక్షించాలని డీపీఓకు సూచించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా పందికోన, జీడిపల్లి రిజర్వాయర్లను నింపాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కోరారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయకుండా ముందు జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి వరకు కేసీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలకు నీరు ఇవ్వాలని కోరారు. చెరువులను నింపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజాప్రతినిధులుగా తాము చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ స్థాయి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
తెలుగుగంగ లైనింగ్ పనులు పూర్తి చేయాలి
వెలుగోడు మండలంలో తెలుగుగంగ కాలువకు రూ.280 కోట్లతో చేపట్టిన లైనింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. సున్నిపెంటలో నిర్మాణం పూర్తయిన ఆసుపత్రికి వైద్య సిబ్బంది, పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. తంగడంచె సమీపంలో 1,600 ఎకరాల్లో ఉన్న జైన్ ఇరిగేషన్ కంపెనీతో ఎలాంటి ప్రయోజనమూ లేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ డిమాండ్ చేశారు. ఇస్కాల, కంబాలపాడు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని మంత్రులను కోరారు. గాజులదిన్నె ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎల్‌ఎల్‌సీ కింద జలచౌర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి కోరారు.
కర్నూలు నగరంలో వచ్చే ఏడాదైనా తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కోరారు. రెండో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం కోసం 80 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని, నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా మొత్తాలను త్వరగా విడుదల చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ..గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా ఇళ్ల పట్టాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 80 వేల మంది వివరాలు పరిశీలించగా.. అందులో 40 వేల మంది అర్హులుగా తేలినట్లు చెప్పారు. జిల్లాలో 1.92 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉందని, 4,800 ఎకరాల భూములు అవసరమని తెలిపారు. ఇందులో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, మిగిలిన వాటి కోసం సర్వే చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విధేకరే, జేసీ–2 ఖాజామొహిద్దీన్ పాల్గొన్నారు.
తీసుకున్న నిర్ణయాలపై రివ్యూ
ఇక నుంచి మూడు నెలలకొకసారి డీఆర్‌సీ సమావేశాలు ఉంటాయి. ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రివ్యూ ఉంటుంది. తగిన పరిష్కారాలను కనుగొనడంలో అధికారులు విఫలమైతే చర్యలు తప్పవు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలను అర్హులకు అందించేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి.
– మంత్రి బొత్స సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment