కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని జగన్నాథగట్టులో 250 ఎకరాలలో ప్రభుత్వం జ్యుడీషియల్ సిటీ నిర్మించనుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. కర్నూలులో రూ.17 కోట్లతో నిర్మించిన హరిత భవన్‌ను మంత్రి బుగ్గన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యుడీషియల్ సిటీలో హైకోర్టుతో పాటు నేషనల్ లా యూనివర్సిటీ, జ్యుడీషియల్ అకాడమీ, వివిధ ట్రిబ్యునళ్లకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమని.. వాటి ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో వరుసగా ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైన కార్యాలయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, విజయవాడతో పాటు ఇప్పుడు కర్నూలులో నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
త్వరలోనే నెల్లూరు, అనంతపురంలో కూడా నూతన భవనాలు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహా్మనందరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సృజన, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎంవీ రావు, బీవై మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment