టీఆర్‌ఎస్‌తో కాళ్లబేరానికి సిద్ధమై జగన్‌పై విమర్శలా?
టీడీపీని నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేత బొత్స
* ‘ఐదు కోట్లకు ఓటు’ కేసులో కేసీఆర్‌తో రాజీకియత్నిస్తోంది మీరుకాదా?
* టీడీపీ కేంద్రమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రిని కలిసింది నిజం కాదా?
* గవర్నర్‌పై నిన్నటిదాకా విమర్శలు చేసి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆయనద్వారా రాజీ చేసుకోవడానికేనా?
* సెక్షన్-8 అమలులోకి రాకున్నా ఎందుకు వెనక్కు తగ్గారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఐదు కోట్లకు ఓటు’ కేసులో దేశ ప్రజలందరూ చూసేలా పూర్తిగా దొరికిపోయిన టీడీపీ నేతలు ఆ కేసునుంచి బయటపడడానికి ఒకవైపు టీఆర్‌ఎస్ పార్టీతో, తెలంగాణ ప్రభుత్వంతో కాళ్లబేరానికి దిగుతూనే మరోవైపు దీనికి జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర పన్నారంటూ దిగజారి విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ నేతలు పినిపె విశ్వరూప్, కొత్తపల్లి సుబ్బారాయుడులతో కలసి శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రి, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని మంత్రి యనమల ఆరోపించారు. రాజకీయాల్లో పెద్దపదవులు అనుభవించిన ఆయన వాస్తవానికి దూరంగా ఇలా అడ్డగోలుగా మాట్లాడితే ఆయన విలువేమవుతుంది? జగన్‌మోహన్‌రెడ్డి వాళ్లని కలిశారంటున్నారు. ఆధారాలు చూపెట్టండి. రూ. ఐదు కోట్లకు ఓటు కేసులో ముద్దాయిగా మారిన మీరు, మీ పార్టీ కేసీఆర్‌తో కాళ్లబేరానికి వచ్చి, కేసును రాజీ చేసుకోవాలన్న ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తిరిగి వాళ్లతో జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయినట్టు ప్రజల్లో అపోహలు సృష్టించాలనుకుంటున్నారా?’’ అని మండిపడ్డారు.
టీ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారనడానికీ, స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని లేఖ రాశారనడానికి మీవద్ద ఆధారాలున్నాయా? ఉంటే చూపెట్టాలని సవాలు విసిరారు. ‘ఆ కేసునుంచి బయటపడడంకోసం టీడీపీ కేంద్రమంత్రి గురువారం ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రిని ప్రత్యక్షంగా కలిసింది వాస్తవం కాదా? నిన్నటిదాకా గవర్నర్‌పై గంగిరెద్దు అని విమర్శలు చేసి, ఇప్పుడు వెనక్కి తగ్గడం గవర్నర్ ద్వారా కేసును రాజీ చేసుకోవడానికేనా?’ అని ప్రశ్నించారు. మీరు డిమాండ్ చేసిన సెక్షన్-8 అమల్లోకి రాకపోయినాఎందుకు వెనక్కితగ్గారని నిలదీశారు.
రాజకీయాల్లో కుట్ర బాబుతోనే పుట్టింది
రాజకీయాల్లో కుట్ర చంద్రబాబుతోనే పుట్టిందని బొత్స విమర్శించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుతో ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవారు కుట్రపన్ని ఆ పెద్దమనిషిని గద్దె దింపారని దుయ్యబట్టారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే యనమల ఆరోపణలకు ఆధారాలు చూపాలని, చూపితే తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని, లేకపోతే వారు ఏమిచేస్తారో చెప్పాలన్నారు.
ట్యాపింగ్ ఆధారాలు బయటపెట్టరేం?
ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆధారాలను ఎందుకు బయటపెట్టట్లేదని బొత్స ప్రశ్నించారు. 48 గంటల్లో ఇద్దరు అధికారులను అరెస్టు చేస్తామన్నారనీ ప్రభుత్వం కూలిపోతుందన్నారనీ అది ఏమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో లాలూచీపడాలని అనుకుంటున్నారా? ఇలా మీరూమీరూ లాలూచీపడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా అని బొత్స ప్రశ్నించారు.
60 ఏళ్ల పెంపు అందరికీ వర్తింపజేయాలి
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారందరికీ వర్తింపజేయాలని వైఎస్సార్‌సీపీ నేత బొత్స డిమాండ్ చేశారు.