విశాఖపట్నం : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టినట్టు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. గాంధీజయంతి రోజున గ్రామసచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి తొలి అడుగువేశామన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలతో ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహాత్ముని ఆశయాలు అమలు కోసం 1, 27,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కడా ఇంత పారదర్శకమైన ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవన్నారు.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉంది. గత ప్రభ్యత్వంలో కొంతమంది మంత్రులు, ఎమ్యెల్యేలు ఉద్యోగాలు కల్పిస్తామని రూ.10 లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేశారు. అలాంటి మీరు నేడు సచివాలయాలకు ఎంపికయిన ఉద్యోగులను, వాలంటీర్లను అవహేళన చేస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావు, సీఎండీఏ కమిషనర్ విజయ్‌కుమార్, నార్త్ కన్వీనర్ కేకే రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment