
పాయకరావుపేట: అంతవరకు తోటి స్నేహితులతో గెంతులేస్తూ ఎంతో ఆనందంగా ఆడుకున్న తన గారాలపట్టి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ సమయంలో భర్త కూడా ఊరిలో లేకపోవడంతో ఏం చేయాలో తోచక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక శోకసంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట పట్టణంలో గల ప్రశాంతినగర్‌లో ట్రాక్టరు ఢీకొని ఐదు సంవత్సరాల బాలుడు దుర్మరణం చెందాడు. రాపేటి సురేష్, జానేశ్వరి దంపతులు స్థానిక ప్రశాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.వీరిలో రెండో కుమారుడు వినయ్(5) సోమవారం ఉదయం స్నేహితులతో వీధిలో ఆడుకుంటూ ఉండగా మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది.
పోలవరం కాలువ వైపు నుంచి గ్రావెల్‌తో వస్తున్న ట్రాక్టర్ బాలుడిని ఢీకొంది. దీంతో వినయ్ తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ తండ్రి సురేష్ హైదరాబాద్ వెళ్లడంతో ఆయనకు సమాచారం అందించారు. తల్లి జ్ఞానేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎం.విభీషణరావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment