
ప్రమాదస్ధలంలో నూకరత్నం మృతదేహం(ఇన్‌సెట్‌లో) కుమార్తెను పట్టుకొని రోదిస్తున్న జగదీష్
చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై తిరుగు పయనమయ్యారు. బీఎన్ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్ నడుపుతున్న జగదీష్ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు.
రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చాడు.

Comments
Please login to add a commentAdd a comment