తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు.
కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్‌లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment