బ్రహ్మోత్సవాలకు మెరుగ్గా సేవలందించాలి
తిరుమల: తిరుమలలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులకు స్థానిక హోటల్ యజమానులు, కూరగాయల దాతలు మరింతగా సేవలు అందించాలని టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్ పిలుపునిచ్చారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన హోటల్ యజమానులు, కూరగాయల దాతలతో వేర్వేరుగా సమీక్షించారు.
మొదటగా హోటల్ యజమానుల సమావేశంలో డెప్యూటీ ఈవో వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని వివిధ హోటళ్లు టీటీడీ పిలుపు మేరకు ముందుకు వచ్చి భక్తులకు విశేషంగా అల్పాహార వితరణ చేశారని కొనియాడారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఎక్కవ మందికి, మంచి నాణ్యతతో అల్పాహారాన్ని అందించాలని కోరారు. ఈ మేరకు హోటళ్ల యజమానులు కూడా సానుకూలంగా స్పందిస్తూ భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సేవలు అందిస్తామని తెలిపారు.
అనంతరం జరిగిన కూరగాయల దాతల సమావేశం వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు దాతలు దాదాపు 91 టన్నుల కూరగాయలను టీటీడీకి విరాళంగా అందజేశారన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు మరో 10 టన్నుల కూరగాయలను అందించాలని కోరారు.
వివిధ రకాల కూరగాయలు విరాళంగా ఇవ్వటం వల్ల భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను అందించగలమన్నారు. కూరగాయల దాతలు కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ శుచి, శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను భక్తులకు అందించాలని హోటళ్ల యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, ఏఈవో గీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.