కాణిపాకంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి బ్రహ్మాత్సవాలు ప్రారంభమవుతాయి. 21రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వయంభు వినాయకుడి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి రోజు ప్రారంభం కావడం ఇక్కడ ఆనవాయితి.
ఆదిదేవుణ్ణి మొదట పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు వినాయకుడికి చాలా భక్తి శ్రద్దలతో నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుతారు. అయితే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు 21రోజుల పాటు నిర్వహిస్తారు. కాణిపాకం చుట్టూ ఉన్న 14 గ్రామాల ప్రజలు బ్రహ్మత్సవాల్లో పాల్గొంటారు. ఆలయం తరఫున 11 రోజులు మరో 9 రోజులు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పూజాకార్యక్రమాల్లో అందరికి ప్రాధాన్యతనిస్తారు.
వినాయక చవితితో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలంకరణ, భక్తుల బారులుతీరేందుకు ఏర్పాట్లు, స్నానాల కోసం కోనేరు, వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.