భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయ అధికారులు ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని పీడించారు. కానీ కొద్దిమంది అధికారులు ప్రజల సంక్షేమం కోసం కృషిచేసి వారి మదిలో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో సర్ థామస్ మన్రో ఒకరు. దత్తమండలాల తొలికలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనేక సంస్కరణలు అమలు చేశారు. ఈయనకు పత్తికొండ పట్టణంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో నేటికీ మన్రోలయ్య అనే పేరు పెట్టుకుంటారంటే ఈయనపై వీరికి గల చెరిపేయలేని అభిమానం అర్థం చేసుకోవచ్చు. మన్రో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
సాక్షి, కర్నూలు : తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలో క్యాడెట్‌గా పనిచేసేందుకు థామస్‌మన్రో ఇండియాకు వచ్చారు. తన ప్రతిభాపాటవాలతో సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. రాయలసీమ (కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలు) దత్తమండలాలకు 1800 సంవత్సరంలో తొలి ప్రిన్సిపల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు అమలులో ఉన్న జమీందారు పద్ధతిని రద్దు చేసి రైత్వారీని ఈయన అమలు చేశారు. సాగుచేసే భూములపై రైతులకుయాజమాన్య హక్కులు కల్పించారు.
తాను కలెక్టర్‌గా పనిచేసిన 7ఏళ్లలో 3లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు భూములు అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పించారు. ఈ నిర్ణయాలతో సాగుభూమి గణనీయంగా పెరగడమే కాకుండా ప్రభుత్వ ఆదాయం 50 శాతం పెరిగింది. సర్‌థామస్ మన్రోకు తెలుగుభాష అంటే ఎనలేని అభిమానం. 1805 నాటికే తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. రాయలసీమలో జిల్లాకోర్టులు ఏర్పాటు చేసి, పోలీసు యంత్రాంగాన్ని నియమించి చట్టబద్ద పరిపాలన అమలయ్యేలా కృషిచేశారు. జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రాలలో పాఠశాలలు ఏర్పాటు చేయించారు.
పాలెగాళ్ల అరాచకాలకు అడ్డుకట్ట
రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడానికి బ్రిటీష్ వారు పాలెగాళ్లను నియమించుకున్నారు. కాని కొందరు పాలెగాళ్లు ప్రజలు నుంచి వసూలు చేసిన పన్నులను బ్రిటీష్‌వారికి కట్టకుండా స్వాహా చేసేవారు. అలాగే 80 మంది పాలెగాళ్లు, వారి అనుచరులు ప్రజలను వేధించి దోచుకుంటూ ప్రజాకంటకులుగా మారారు. సర్‌థామస్ మన్రో సైన్యాన్ని రప్పించి పాలెగాళ్లను కఠినంగా అణచివేశారు. గ్రామాల్లో దొరల పాలనను రద్దుచేసి వారికి ఫించన్ ప్రవేశపెట్టారు.
ప్రజల వద్దకు పాలన
గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాలు పర్యటిస్తూ సర్‌థామస్ మన్రో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేవారు. గ్రామాల్లో డేరాలు వేసుకుని ఉంటూ అక్కడ ప్రజలతో సమావేశాలు జరిపేవారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు అమలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మైళ్ల కొద్దిదూరం నడచి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించేవారు.
జ్ఞాపకాలు పదిలం
మన్రో జ్ఞాపకార్థంగా ఆయన శిలాప్రతిమను పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన తైలవర్ణచిత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో, ప్రభుత్వ డిగ్రీకళాశాల, గ్రామపంచాయతీ లోనూ ఉన్నాయి. ప్రతిఏటా జూలై 6న తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు మన్రో వర్ధంతిని నిర్వహిస్తున్నారు. పత్తికొండ పాతబస్టాండుకు సమీపంలో ఐసీడీఎస్‌కార్యాలయం పక్కనే మన్రో గుర్తుగా నిర్మించిన బావి ఉంది. పట్టణంలో ఒక కాలనీకి మన్రోపేట అని పేరు పెట్టారు. మన్రోపేట బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
పత్తికొండలోనే తుదిశ్వాస
రాయలసీమ దత్తమండలాల ప్రిన్సిపాల్ కలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనంతర కాలంలో మద్రాసు గవర్నర్‌గా పదోన్నతిపై వెళ్లారు. 1827 సంవత్సరంలో పత్తికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలు అనేకమంది మృత్యువాత పడ్డారు. అప్పుడు మద్రాసు గవర్నర్‌గా ఉన్న సర్‌థామస్ మన్రో ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకునేందుకు పత్తికొండకు వచ్చారు.. గ్రామాలకు వెళ్లి కలరా వ్యాధిగ్రస్తులను పరామర్శించిన మన్రో కలరా వ్యాధి బారిన పడ్డారు.. కలరావ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన మన్రో పత్తికొండలోనే మకాం వేసి వైద్యులను ఇక్కడికే పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ కోలుకోలేక 1827 సంవత్సరం జూలై 6వతేదిన పత్తికొండలోనే తుదిశ్వాస విడిచారు. మన్రో భౌతికకాయాన్ని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి తరలించి అక్కడే సమాధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment