Madras Presidency
-
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
చరిత్ర మరిచినా..మేం మరువం మన్రో
భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయ అధికారులు ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని పీడించారు. కానీ కొద్దిమంది అధికారులు ప్రజల సంక్షేమం కోసం కృషిచేసి వారి మదిలో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో సర్ థామస్ మన్రో ఒకరు. దత్తమండలాల తొలికలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనేక సంస్కరణలు అమలు చేశారు. ఈయనకు పత్తికొండ పట్టణంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో నేటికీ మన్రోలయ్య అనే పేరు పెట్టుకుంటారంటే ఈయనపై వీరికి గల చెరిపేయలేని అభిమానం అర్థం చేసుకోవచ్చు. మన్రో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూలు : తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలో క్యాడెట్‌గా పనిచేసేందుకు థామస్‌మన్రో ఇండియాకు వచ్చారు. తన ప్రతిభాపాటవాలతో సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. రాయలసీమ (కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలు) దత్తమండలాలకు 1800 సంవత్సరంలో తొలి ప్రిన్సిపల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు అమలులో ఉన్న జమీందారు పద్ధతిని రద్దు చేసి రైత్వారీని ఈయన అమలు చేశారు. సాగుచేసే భూములపై రైతులకుయాజమాన్య హక్కులు కల్పించారు. తాను కలెక్టర్‌గా పనిచేసిన 7ఏళ్లలో 3లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు భూములు అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పించారు. ఈ నిర్ణయాలతో సాగుభూమి గణనీయంగా పెరగడమే కాకుండా ప్రభుత్వ ఆదాయం 50 శాతం పెరిగింది. సర్‌థామస్ మన్రోకు తెలుగుభాష అంటే ఎనలేని అభిమానం. 1805 నాటికే తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. రాయలసీమలో జిల్లాకోర్టులు ఏర్పాటు చేసి, పోలీసు యంత్రాంగాన్ని నియమించి చట్టబద్ద పరిపాలన అమలయ్యేలా కృషిచేశారు. జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రాలలో పాఠశాలలు ఏర్పాటు చేయించారు. పాలెగాళ్ల అరాచకాలకు అడ్డుకట్ట రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడానికి బ్రిటీష్ వారు పాలెగాళ్లను నియమించుకున్నారు. కాని కొందరు పాలెగాళ్లు ప్రజలు నుంచి వసూలు చేసిన పన్నులను బ్రిటీష్వారికి కట్టకుండా స్వాహా చేసేవారు. అలాగే 80 మంది పాలెగాళ్లు, వారి అనుచరులు ప్రజలను వేధించి దోచుకుంటూ ప్రజాకంటకులుగా మారారు. సర్‌థామస్ మన్రో సైన్యాన్ని రప్పించి పాలెగాళ్లను కఠినంగా అణచివేశారు. గ్రామాల్లో దొరల పాలనను రద్దుచేసి వారికి ఫించన్ ప్రవేశపెట్టారు. ప్రజల వద్దకు పాలన గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాలు పర్యటిస్తూ సర్‌థామస్ మన్రో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేవారు. గ్రామాల్లో డేరాలు వేసుకుని ఉంటూ అక్కడ ప్రజలతో సమావేశాలు జరిపేవారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు అమలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మైళ్ల కొద్దిదూరం నడచి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించేవారు. జ్ఞాపకాలు పదిలం మన్రో జ్ఞాపకార్థంగా ఆయన శిలాప్రతిమను పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన తైలవర్ణచిత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో, ప్రభుత్వ డిగ్రీకళాశాల, గ్రామపంచాయతీ లోనూ ఉన్నాయి. ప్రతిఏటా జూలై 6న తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు మన్రో వర్ధంతిని నిర్వహిస్తున్నారు. పత్తికొండ పాతబస్టాండుకు సమీపంలో ఐసీడీఎస్కార్యాలయం పక్కనే మన్రో గుర్తుగా నిర్మించిన బావి ఉంది. పట్టణంలో ఒక కాలనీకి మన్రోపేట అని పేరు పెట్టారు. మన్రోపేట బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పత్తికొండలోనే తుదిశ్వాస రాయలసీమ దత్తమండలాల ప్రిన్సిపాల్ కలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనంతర కాలంలో మద్రాసు గవర్నర్‌గా పదోన్నతిపై వెళ్లారు. 1827 సంవత్సరంలో పత్తికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలు అనేకమంది మృత్యువాత పడ్డారు. అప్పుడు మద్రాసు గవర్నర్‌గా ఉన్న సర్‌థామస్ మన్రో ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకునేందుకు పత్తికొండకు వచ్చారు.. గ్రామాలకు వెళ్లి కలరా వ్యాధిగ్రస్తులను పరామర్శించిన మన్రో కలరా వ్యాధి బారిన పడ్డారు.. కలరావ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన మన్రో పత్తికొండలోనే మకాం వేసి వైద్యులను ఇక్కడికే పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ కోలుకోలేక 1827 సంవత్సరం జూలై 6వతేదిన పత్తికొండలోనే తుదిశ్వాస విడిచారు. మన్రో భౌతికకాయాన్ని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి తరలించి అక్కడే సమాధి చేశారు. -
అమరం... అమరం...
చెన్నై సెంట్రల్ : తెలుగువారి కబుర్లు రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అవి... మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రోజులు... తెలుగువారంతా ఏకమై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం గొంతు విప్పిన ఉద్రిక్త వాతావరణం... తెలుగు నాయకులంతా ముక్త కంఠంతో తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులు... మైలాపూర్‌లోని రెండు భవంతులు ఈ ప్రక్రియలో ప్రధానపాత్ర వహించాయి. మొదటిది శ్రీబాగ్... అమృతాంజనం వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావుగారికి చేరింది... రెండవది లజ్ చర్చ్ రోడ్డులో ఉన్న గార్డెన్ హౌస్... 19వ శతాబ్దం ప్రారంభంలో దివంగత పి.ఆర్.సుందర్ అయ్యర్ నిర్మించిన భవంతి... పొట్టి శ్రీరాములు అమరులయిన భవంతి... ఆ వీధిలోకి అడుగు పెడితే అమరజీవి మనకు అజరామరంగా కనిపిస్తారు. ఆయనను కన్నులారా వీక్షించని వారు సైతం ఒకసారి ఆయన మనలను పలకరించిన అనుభూతి చెందుతాం. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిస్వార్థంగా, ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఇక్కడ అమరుడయ్యాడా అని ఒక్కసారి గుండె తడి కాక మానదు. చిన్న సందులో ఆఖరున ఉన్న ఆ భవంతి నేడు ఎన్నో మార్పులకు లోనయినప్పటికీ, ఆయన కూర్చున్న ప్రదేశాన్ని వీక్షించగానే 1952 నాటి ఘటన మన ఎద లోతులను తడమక మానదు. ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని కచ్చితంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, రాయలసీమకు గుండెకాయ వంటి కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేయడం... వంటి విషయాల గురించి తెలుగు నాయకులంతా విస్తృతంగా, తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు అవి. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, ఈ విషయం వెనకబడిపోయింది. 1949లో ఒకసారి, 1952లో ఒకసారి ఈ అంశం తెర మీదకు వచ్చినా, అధికారులెవ్వరూ ఈ విషయం మీద పూర్తి శ్రద్ధ వహించలేదు. ప్రముఖ గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు సరిగ్గా ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన దీక్ష ప్రారంభిస్తానన్నారు. ఆ నిరశన వ్రతం ప్రారంభించడానికి స్థలం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పొట్టి శ్రీరాములు పట్టుదల మనిషి. ‘ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే నా దీక్ష ఏ మాత్రం ఆగదు. ముందూ వెనుకా అట్టలు కట్టుకుని వీధులలో తిరుగుతూ ప్రాణాలు విడుస్తాను’ అని ప్రకటించిన పట్టుదల మనిషి శ్రీరాములు. బులుసు సాంబమూర్తి ఆయన వ్రతానికి ఆశ్రయం ఇచ్చాడు. గాంధీజీతో మన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైతే, శ్రీరాములు ఆత్మబలిదానంతో మన చరిత్ర మరొక కొత్త మలుపు తిరిగింది. అక్టోబరు 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబరు 16వ తేదీ మంగళవారం, 58 రోజుల ఉపవాస దీక్షతో పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆయన మరణంలో తెలుగు వారు ఒక్కసారిగా హింసామార్గంలో ప్రవేశించారు. మైలాపుర్ లజ్ కార్నర్ సమీపంలో నెం. 89, రాయపేట్ హైరోడ్, ఇల్లు సాంబమూర్తి గారి నివాసగృహం. అక్కడే పొట్టి శ్రీరాములు కృశించిన, జీవం లేని దేహమున్న పవిత్ర స్థానం. ఆ గృహం ముందరి ప్రదేశంలోనే కర్రలతో, కొబ్బరి ఆకులతో నిర్మించిన వేదికపై శ్రీరాములు పార్థివదేహాన్ని ఉంచారు. శ్రీరాములు మరణవార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. ఈలోగానే తండోపతండాలుగా వచ్చే జనంతో వీధివీధంతా కిక్కిరిసిపోయింది. వచ్చినవారు అమరజీవిని అంతిమ దర్శనం చేసుకొని ఆయన శరీరం మీద పుష్పమాలలు వుంచి అశ్రునేత్రాలతో మరలుతున్నారు. ఆ నాటి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ఇంటి వద్ద నుంచి పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర సాగుతున్నంతసేపు ఘంటసాల, మోపర్రుదాసు... అందరి హృదయాలు ద్రవించేలా జాతీయగీతాలను ఆలపించారు. మేడలపై నుంచి పౌరులు పూలవానలు కురిపిస్తూ, ‘పొట్టి శ్రీరాములు అమర్ రహే, మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలి’ వంటి నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా చేశారు. ‘‘శ్రీరాములు చనిపోలేదు. అతడు అమరజీవి అయ్యాడు’’ అని పెద్దలందరూ కన్నీటితో నిండిన గుండె బరువుతో ఆక్రోశించారు. ఊరేగింపులో పాల్గొన్నవారిలో తెలుగు వారే కాదు, తమిళులు తదితరులు కూడా ఉన్నారు. మద్రాసు తెలుగువారి పట్ల తమిళులు ఎప్పుడూ ఆదరభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు. సాంబమూర్తి గారి ప్రైవేట్ కార్యదర్శి శ్రీరామదేశికర్ తమిళుడు! అయినా ఆ ఊరేగింపు ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. శ్రీరాముల ఆత్మబలిదాన ఫలితంగా ఎన్నడూ అనుకోని విధంగా మదరాసు నగరంలోనూ, ఆంధ్రరాష్ట్రంలోనూ మాత్రమే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చెలరేగిన సంక్షోభం ఒక్కసారిగా నెహ్రూ కూర్చున్న సింహాసనాన్ని కుదిపేసింది. మరో ఆలోచన లేకుండా డిసెంబరు 19న, భాషా ప్రాతిపదికన, నెహ్రూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ప్రకటించారు. ఇందులో కోస్తా ప్రాంతం, కర్నూలు రాజధానిగా రాయలసీమ, ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా... 1953, అక్టోబరు 1 న ప్రత్యేక తెలుగు రాష్ట్ర ప్రకటన జరిగింది. మూడు సంవత్సరాల తర్వాత నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా ఇందులో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. శ్రీబాగ్ అనేది అమృతాంజనం ప్రాంగణంలో పురాతనంగా నిలిచిపోయింది. బులుసు సాంబమూర్తి గారి నివాసం పొట్టి శ్రీరాములు స్మారకంగా చరిత్రకెక్కింది. నాటి భవనం శిథిలం కావడంతో, వై.ఎస్. శాస్త్రి అవిశ్రాంతంగా తపస్సు చేసి, ప్రస్తుతం ఉన్న భవంతిని పూర్తి చేసి, అక్కడ శ్రీరాములు జయంతి, వర్థంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈ మహానుభావుని త్యాగఫలంగా నిర్వహించుకుంటున్నాం. కాని చెన్నైలో జన్మించి, చెన్నైలో దీక్ష చేసి, చెన్నైలో తనువు చాలించిన ‘అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం’ ఏటా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే నిధుల కోసం నిరీక్షిస్తూ ఉండటం తెలుగువారు బాధపడాల్సిన విషయంగా పలువురు పెద్దలు అంటున్నారు. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై (ఇన్పుట్స్: వై రామకృష్ణ, వై.యస్.శాస్త్రి రచించిన ‘అమరజీవి సమరగాథ’ పుస్తకం ఆధారంగా) -
6 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు
5వ తేదీ సాయంత్రం అంకురార్పణ 8వ తేదీ పుష్కరిణిలో చక్రస్నానం తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాలు, నిత్య పూజాది కార్యక్రమాల్లో తెలిసీతెలియక జరిగిన తప్పులతో ఏర్పడ్డ దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయనున్న యాగశాలలో 6వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 7వ తేదీ పవిత్ర సమర్పణ, 8వ తేదీ పవిత్ర విసర్జన పూజలు నిర్వహించనున్నారు. కాగా పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 5వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. పవిత్రోత్సవాల్లో చివరి రోజైన 8వ తేదీ సాయంత్రం అమ్మవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు రూ.750 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు ఇద్దరిని అనుమతించనున్నారు. నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 18 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయ సన్నిధి గోడలను శుభ్రం చేయనున్నారు. 9 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సేవలు రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా 2, 5 తేదీల్లో కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవను రద్దు చేశారు. అలాగే 6, 7, 8 తేదీల్లోనూ కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవతో పాటు వారపు సేవలైన పుష్పాంజలి, అష్టదళ పాదపద్మారాధన రద్దు చేశారు.