6 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు
- 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ
- 8వ తేదీ పుష్కరిణిలో చక్రస్నానం
తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాలు, నిత్య పూజాది కార్యక్రమాల్లో తెలిసీతెలియక జరిగిన తప్పులతో ఏర్పడ్డ దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయనున్న యాగశాలలో 6వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 7వ తేదీ పవిత్ర సమర్పణ, 8వ తేదీ పవిత్ర విసర్జన పూజలు నిర్వహించనున్నారు. కాగా పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 5వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. పవిత్రోత్సవాల్లో చివరి రోజైన 8వ తేదీ సాయంత్రం అమ్మవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు రూ.750 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు ఇద్దరిని అనుమతించనున్నారు.
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 18 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయ సన్నిధి గోడలను శుభ్రం చేయనున్నారు. 9 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
సేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా 2, 5 తేదీల్లో కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవను రద్దు చేశారు. అలాగే 6, 7, 8 తేదీల్లోనూ కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవతో పాటు వారపు సేవలైన పుష్పాంజలి, అష్టదళ పాదపద్మారాధన రద్దు చేశారు.