తెగిన చేయి అతికింది | Broken arm surgery | Sakshi
Sakshi News home page

తెగిన చేయి అతికింది

Published Fri, Jan 31 2014 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తెగిన చేయి అతికింది - Sakshi

తెగిన చేయి అతికింది

సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తూ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని తెగిపోయిన ఓ బాలిక చేతిని అమీర్‌పేట్‌లోని ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అతికించారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అనురాగ్ చిత్రాన్షి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్‌రెడ్డి చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మణికట్టు పైభాగంలో తెగిన భాగాలను ఆరు గంటల  వ్యవధిలో, కింది భాగాలను 16 గంటల  వ్యవధిలో అమర్చవచ్చని తెలిపారు.
 
 ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన తనిష్క(9) హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లోని తన తాత గంగాధర్ ఇంట్లో ఉండగా డిసెంబర్ 10వ తేదీన బాలిక కుడిచేయి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది.
 విషయం తెలియక కింది అంతస్థులో ఉన్నవారు బటన్ నొక్కడంతో లిఫ్ట్ వేగంగా కదలి బాలిక మణికట్టు పైభాగం వద్ద పూర్తిగా తెగిపోయింది.
 
 రక్తమోడుతున్న పాపతో పాటు తెగిపడిపోయిన భాగాన్ని ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే చికిత్స కోసం సమీపంలోని ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు.
 
 వైద్యులు తెగిపడిన చేతిని శుభ్రపరిచి ఐస్ గడ్డలతో నింపిన థర్మాకోల్ బాక్స్‌లో భద్రపరిచారు.
 
 మ. 2.30 గం.కు పాపను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.
 
 వైద్యులు సుమారు 8 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన చేతి ఎముకతో పాటు సిరలు, ధమనులు, కండరాలను యథావిథిగా అమర్చి కుట్లు వేశారు.
 
 ఇలా అతికించిన ఆరు గంటల్లోనే ధమనుల్లో రక్త ప్రసరణ తిరిగి ప్రారంభమైంది.
 బాలిక చేయి అతుక్కున్నప్పటికీ అరచేతిలో ఇంకా స్పర్శ రాలేదు. భవిష్యత్తులో చేతికి స్పర్శ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు.
 శస్త్ర చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చు అయినట్లు బాలిక తాత గంగాధర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement