పదేళ్ల పాటు అధికారం లేకపోవడం వల్ల తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయన్న విషయంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో అన్ని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. ప్రతి పనీ తమకే కావాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పాడైన రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు 151 పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా 76 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో 2,664 రోడ్డు పనుల కోసం రూ.493.06 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కూడా 1,583 పనులు ప్రాంరభానికి నోచుకోలేదు. హెచ్‌ఎల్‌సీ, యాడికి కెనాల్, మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ (అనంతపురం) ఆధునికీకరణ పనుల కోసం రూ.1,084.83 కోట్లు మంజూరు చేశారు.
ఈ పనులు కూడా నత్తను తలపిస్తుండడంతో తుంగభద్ర జలాశయం నుంచి వస్తున్న నీటిలో చాలావరకు ఇంకి పోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానికి గానూ సర్వశిక్షా అభియాన్ ద్వారా 716 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఒక్కో గదికి గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.6.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.7.30 లక్షల చొప్పున మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 58 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తమ పార్టీ కార్యకర్తలకే పనులు అప్పగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. విద్యాశాఖాధికారులకు హుకుం జారీ చేయడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. అనంతపురం సర్వజనాస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.89 కోట్లు మంజూరు చేయాలంటూ గత ఏడాది ఆస్పత్రి కమిటీ ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో పశు వైద్యశాలలకు 64 భవన నిర్మాణాల కోసం రూరల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.8.55 కోట్లు మంజూరయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా ఇంత వరకు భవన నిర్మాణాలు ప్రారంభ ం కాలేదు.
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) పరిధిలో ఒక్కో గోపాలమిత్ర సెంటర్ నిర్మాణానికి రూ.7.50 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. జిల్లాకు 114 సెంటర్లు కేటాయించగా.. అందులో 56 సెంటర్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తక్కిన పనులు మొదలు పెట్టలేదు.
జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ శాఖలలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, దోబీఘాట్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు బీఆర్ జీఎఫ్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.43.91 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పనికూడా ప్రారంభించలేదు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 53 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేసిన ‘ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్’ నిర్మాణానికి 2011లో రూ.35 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు శిలాఫలకం వేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్‌లో సాంకేతిక సమస్యల వల్ల జిల్లాలో 75,093 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు దాదాపు రూ.46 కోట్ల మేర బిల్లులు పెండింగ్ పడ్డాయి.
స్వయం ఉపాధికి సంబంధించి 9,154 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రూ.43.05 కోట్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు కింద జిల్లాకు రూ.68 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది.
రాజకీయ కారణాలతో స్టోర్ డీలర్లను తొలగిస్తుండడంతో కార్డుదారులకు రేషన్ సక్రమంగా అందక అవస్థ పడుతున్నారు.
‘తమ్ముళ్ల’ స్వలాభం.. అభివృద్ధికి శాపం
Published Thu, Jul 24 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement