జాతర సందర్భంగా జరిగిన తోపులాటలో తమ వర్గానికి చెందిన వారిని నెట్టేశారనే నెపంతో.. ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కత్తులతో దాడి చేశారు.
విడవలూరు (నెల్లూరు) : జాతర సందర్భంగా జరిగిన తోపులాటలో తమ వర్గానికి చెందిన వారిని నెట్టేశారనే నెపంతో.. ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండల అలగానుపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. అలగానుపాడు గ్రామంలో వారం రోజుల కిందట జరిగిన బంగారమ్మతల్లి జాతరలో రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది.
దీంతో మనస్తాపం చెందిన ఒక వర్గానికి చెందిన 15 మంది వ్యక్తులు శనివారం మరో వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులను చేపలు పడుతున్న సమయంలో కురస కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు యువకులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.