కీవ్ సమీపంలోని మెరెఫాలో రష్యా దాడిలో మంటల్లో చిక్కుకున్న పాఠశాల భవనం
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్‌కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది.
కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్‌లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు.
పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్‌స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది.
తిరిగి వస్తున్న శరణార్థులు!
ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి.
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్‌స్కీ
రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు.
మెలిటోపోల్ మేయర్ విడుదల
తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్‌నా ధ్రువీకరించారు.
‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్
నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.
నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment