♦ రోకలితో మోది... తల చితక్కొట్టిన ఆగంతకులు
♦ పాలకొండ నవోదయనగర్‌లోగల ఇంట్లో ఘటన
♦ ఉలిక్కిపడిన పట్టణ ప్రజలు
♦ భయాందోళనలో స్థానికులు
పాలకొండ/పాలకొండ రూరల్ : అది పాలకొండ పట్టణంలోని నవోదయనగర్... శుక్రవారం మిట్ట మధ్యాహ్నం... ఓ మహిళ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజాం మండలం కొండవలసకు చెందిన ఏ.ఆర్.ఎస్.ఎస్.రాజేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు భార్య ప్రమీల(48)తో కలసి సీతంపేట రోడ్డులోని నవోదయనగర్‌లో 20 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు.
ప్రస్తుతం ఆయన బూర్జ మండలం తోటవాడ మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేయ గా ఆమె అత్తవారింట్లో ఉంటోంది. వైద్య విద్యనభ్యసించిన కుమారుడు ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరే ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం ఉదయం రాజేశ్వరరావు తోటవాడ స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో ప్రమీల ఉన్నారు. రోజూ మాదిరిగానే ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇరుగు, పొరుగువారితో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మాట్లాడారు. అనంతరం డాబాపై ఆరబెట్టిన బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు.
మధ్యాహ్నం స్కూల్‌నుంచి వచ్చిన రాజేశ్వరరావు భోజనం చేసి సమావేశం ఉందంటూ వెంటనే బూర్జ వెళ్లారు. మళ్లీ సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాజేశ్వరరావు ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారిని వాకబు చేశారు. మధ్యాహ్నం వరకు తామంతా మాట్లాడుకున్నామని, ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదని చెప్పటంతో ఇంట్లో మరో మారు చూసిన ఆయన బెడ్ రూమ్ తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు.
ఎంత పిలిచినా బార్య పలకక పోవటంతో తాళాలను విరగ్గొట్టి చూసే సరికి రక్తపు మడుగులో తల పగిలిన ప్రమీలను చూసి నిర్ఘాంత పోయి పెద్దఎత్తున కేకలు వేస్తూ బయటకు రావటంతో ఇరుగు పొరుగు వారు చేరుకొని విషయం తెలుసుకుని చలించి పోయారు. అతి కిరాతంగా గుర్తు తెలియని వారు రోకలి బండతో తలపై మోది హత్యకు పాల్పడ్డారని భావించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం దావానలంలా పట్టణం మొత్తం వ్యాపించటంతో పెద్ద ఎత్తున స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవటంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు.
అందరితో కలివిడిగా ...
ప్రమీల చుట్టు పక్కల వారితో ఎప్పుడూ కలివిడిగా ఉండేవారని, అటువంటి ఆమెను హత్యచేయడానికి కారణాలేమిటో అంతుచిక్కడంలేదని అక్కడి వారు పేర్కొంటున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న ఆమె గంటల వ్యవధిలో హత్యకు గురవ్వటంతో ఆశ్చర్య పోతున్నారు. మరో వైపు మృతురాలి భర్త రాజేశ్వరరావు షాక్‌కు గురై ఏ విషయాన్నీ చెప్పలేక పోతున్నారు. కుప్పకూలిపోయిన ఆయనను స్థానికులు ఓదార్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హత్యపై అనుమానాలెన్నో...
మహిళ హత్యపై అంతుపట్టని అనుమానాలు రేగుతున్నాయి. పూర్తిగా జనావాసాల మధ్య వీరు నివాసం ఉంటున్న ఇల్లు ఉంది. పక్కనే ప్రైవేటు పాఠశాలకు చెందిన వసతి గృహం ఉంది. ఇంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మహిళను హత్య చేయటం అంటే సాధారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో మహిళ ప్రతిఘటించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మహిళ అరుపులైనా స్థానికులకు వినిపించక పోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ సంఘటనలో సొత్తు ఏమైనా పోయిందో ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. కాక పోతే మృతిరాలి మెడలో నల్లపూసలు, పుస్తెలు, బంగారు గాజులు కలిపి సుమారు 12తులాలు కనిపించడం లేదని తెలుస్తోంది. దొంగతనానికి వచ్చిన దుండగులు ఆమెను హత్య చేశారా అన్నకోణంలో పోలీసులు దృష్టి సారించారు. హత్యకు పాల్పడింది స్థానికులా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అన్నదానిపై స్పష్టత రాలేదు. బాగా తెలిసిన వారే హత్యకు పాల్పడి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
చురుగ్గా దర్యాప్తు
రాత్రి 7గంటల సమయంలో క్లూస్ టీం రంగంలోకి దిగింది. పోలీస్ జాగిలాలు ముందుగా సీతంపేట రోడ్ వైపు అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రి, ఆర్టీసీ కాంప్లెక్స్, వెంకటరాయుని కోనేరు గట్టుపైనా తిరిగటంతో దుండగులు ఈ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు పోలీసులు అంచనాకు వస్తున్నారు. డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
భయాందోళనలో స్థానికులు...
మహిళ హత్య స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి అతి కిరాతకంగా మహిళను చంపటంతో స్థానిక మిహ ళలు ఆందోళన చెందుతున్నారు. ఇంత వరకు ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరగక పోవటంతో అంతా ప్రశాంతంగా ఉండేది. తాజా సంఘటన అన్ని వర్గాలను కలవరపెడుతుంది.
పట్టపగలే మహిళ దారుణ హత్య
Published Sat, Jul 11 2015 4:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement