బీటీవీ రామారావు
సాక్షి, విశాఖపట్నం: ట్యాంపర్ వీరుడు మళ్లీ వచ్చారు.. ఎన్నిసార్లు వద్దు పొమ్మంటున్నా.. మళ్లీ ఇక్కడే పోస్టింగ్ కోసం పావులు కదుపుతూనే ఉన్నాడు. రాజకీయంగానే కాదు.. ప్రభుత్వ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ పోస్టింగ్ పొందుతున్నాడు. ఈసారి జిల్లాకు కేటాయించడం కాదు.. ఏకంగా పోస్టింగ్‌తోనే వచ్చాడు. కానీ ససేమిరా అతడ్ని విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూకుంభకోణం పేరు చెప్పగానే గుర్తొకొచ్చే మొట్టమొదటి పేరు బీటీవీ రామారావు. ఈయన చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో భీమిలి, విశాఖ రూరల్ మండలాల్లో రికార్డులను ట్యాంపర్ చేసి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు లిటిగేషన్‌లో పడేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన చేతివాటం కారణంగా వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయాయి.
సిట్, నాన్ సిట్‌కు అందిన అత్యధిక ఫిర్యాదుల్లో ఈయన పాల్పడిన అవినీతి, అక్రమాలు దాదాపు రుజువయ్యాయి కూడా. అంతే కాదు భూవివాదాల్లో అత్యధిక షోకాజ్ నోటీసులందుకున్న అధికారి కూడా రామారావే. సిట్ సిఫార్సు మేరకు ఈయనపై అనేక కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బీటీవీ రామారావు చేసిన అక్రమాలకు ఆయనను సర్వీస్ నుంచి తొలగించినా తప్పులేదని సిట్ అధికారులు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు, లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యారు. ‘ఈ అధికారి మాకొద్దంటూ’ గతేడాదే అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇంతటి వివాదాస్పద అధికారి మాకొద్దు బాబోయ్ అంటున్నా పదే పదే జిల్లాకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు జిల్లాకు కేటాయించారు. రెండు సార్లు కూడా జేసీలు, అప్పటి కలెక్టర్ విధుల్లో చేర్చుకోకుండా తిప్పి పంపారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర నివేదికతో ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
ఈసారి పోస్టింగ్‌తోనే..
విశాఖ జిల్లాలోనే పోస్టింగ్ పొందాలని పట్టువదలని విక్రమార్కుడిలా బీటీవీ రామారావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జిల్లాకు కేటాయిస్తుంటే పోస్టింగ్ ఇవ్వకుండా తిప్పిపంపుతున్నారని గ్రహించిన రామారావు రాజకీయంగా ప్రభుత్వ పెద్దల ద్వారా సీసీఎల్‌ఏపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈసారి జిల్లాకు కేటాయించడమే కాదు.. ఏ పోస్టులో అతడ్ని నియమించాలో ఆదేశాలు వచ్చాయంటే ఏ స్థాయిలో రామారావుకు ప్రభుత్వ పెద్దల అండ ఉందో అర్థమవుతోంది. సాధారణంగా తహసీల్దార్లను సీసీఎల్‌ఏ కమిషనర్ జిల్లాకు అలాట్ చేస్తారు. అలా అలాట్ అయిన వారికి ఎక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటిది రెండుసార్లు తిరస్కరించిన రామారావుకు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని సీసీఎల్‌ఏ నుంచే ఆదేశాలు రావడంతో విస్తుపోవడం ఉన్నతాధికారుల వంతైంది. అయితే ఆయనను తిప్పిపంపడమే తప్ప విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ సారి రామారావు విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment