రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు
10న ఉదయం 10.08 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్
11న సెలవు.. 13తో సమావేశాల ముగింపు
తొలి 6 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు
ఆమోదం తెలపనున్న సభ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు పనిదినాలు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు అమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10.08 గంటలకు సభ సమావేశం కాగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు. అయితే త్వరలో సాధారణ ఎన్నికలున్నందున ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్‌కు సభ ఆమోదం పొందుతారు. సోమవారం బడ్జెట్ సమర్పణ అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తారు. సభ్యులు బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి మంగళవారం సెలవు ఇస్తారు. తిరిగి బుధవారం సభ ప్రారంభమై బడ్జెట్‌పై సాధారణ చర్చ చేస్తుంది. గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్‌తోపాటు ఓటాన్ అకౌంట్‌కు సభ ఆమోదం పొందుతారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఇంతకుముందే ప్రారంభమైనందున కొత్తగా బడ్జెట్‌కు ముందు ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండదు. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినందున ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, వ్యవసాయ బడ్జెట్ అనేవి ప్రత్యేకంగా ఉండవు.