రక్తమోడిన దేవరగట్టు
దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన బన్ని ఉత్సవాలు రక్తమోడాయి. వెయ్యిమంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా కర్రల సమరం యథేచ్ఛగా నిర్వహించారు. బన్ని సమరంలో 34 మందికిపైగా భక్తులు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమరాన్ని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో 15 మంది పోలీసులు గాయపడ్డారు.
జిల్లా ఎస్పీ అక్కడే మకాంవేసి బందోబస్తు నిర్వహించినా లాభం లేకపోయింది. దేవరగట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చారు. కల్యాణోత్సవం తర్వాత మాత, స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకోత్సవం గట్టు దిగువకు చేరింది. అంతలోనే వేలాదిమంది భక్తులు ఇనుప రింగులు తొడిగిన వెదురు కర్రలు, భగభగ మండే దివిటీలతో కేకలు వేస్తూ ఒక్కసారిగా ప్రత్యక్షమై పల్లకోత్సవం చుట్టూ చేరారు. తమ ఇలవేల్పుకు రక్షణ కల్పించే సంప్రదాయంలో భాగంగా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు.