
సాక్షి, చెన్నై: తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అయ్యప్ప భక్తుల బృందం ప్రయాణిస్తున్న బస్సు శనివారం తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా ఆసనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ భక్తుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన అయ్యప్ప భక్తులు ఇటీవల శబరిమలైకి వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, శనివారం సాయంత్రం ఆసనూరు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.
పరిసర ప్రాంతంలో ఉన్న వారు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విల్లుపురం జిల్లా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉళుందూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నూకరాజు అనే భక్తుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ వారిని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు.