ఏలూరు సిటీ : సర్కారు తీరు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తుంటే.. విద్యా శాఖ అధికారులకు దిగులు పట్టుకుంది. బోలెడు పనిచేస్తున్నా ఉన్నతాధికారుల తీరుతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో నెలకొన్న సమస్యలకు తమను బాధ్యులను చేయటంపై గురువులు, పర్యవేక్షక అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎంఈవో వంటి పర్యవేక్షక పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలనలోనే ఉన్నాయి. ఒక్కొక్క ఉపాధ్యాయుడు రెండు, మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు పట్టించుకోకుండా ఉన్నతాధికారులు తమపై చర్యలు తీసుకోవటాన్ని పర్యవేక్షక అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జిల్లాలో కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులే ఎంఈవో, డీవైఈవోలుగా బాధ్యతలు చేపట్టారు. వీరు పాఠశాలలోను, మండల స్థాయి పోస్టులోను పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేక ఒత్తిడికి గురవుతున్నారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, మధ్యాహ్న భోజన పథకం, శిక్షణ తరగతులు, ఇలా రకరకాల కార్యక్రమాల అమలులో జాప్యానికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమనే విమర్శలూ ఉన్నాయి. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి తమపైనే నిందలు వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
5న యూనిఫామ్స్ పంపిణీ సాధ్యమేనా
సర్కారీ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ ప్రహసనంలా మారింది. ఈనెల 5న ఎట్టిపరిస్థితుల్లో యూనిఫామ్స్ పంపిణీ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ భాస్కర్, డీఈవో మధుసూదనరావు హెచ్చరికలు జారీ చేశారు. కానీ యూనిఫామ్స్ కోసం క్లాత్‌ను పాఠశాలలకు జూలై మొదటి వారంలో సరఫరా చేశారు. కొన్ని పాఠశాలల్లో 400నుంచి వెయ్యి మంది పిల్లలున్నారు. ఇక్కడ యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వటం అంత సులభం కాదు. ఒక్కో జతకు కుట్టికూలీగా రూ.40 మాత్రమే ఇస్తున్నారు. ఆ మొత్తానికి యూనిఫామ్ కుట్టేవారు లేక తీవ్ర జాప్యం జరిగింది. జిల్లాలో 2.30 లక్షల మంది పిల్లలకు రెండేసి జతల చొప్పున యూని ఫామ్స్ కుట్టించి ఇవ్వాలి. ఇందుకు కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు పట్టించుకోకపోవటం దారుణమంటున్నారు.
పర్యవేక్షణ కొరవడింది
జిల్లాలోని పాఠశాలల్లో పరిస్థితులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితులు కనిపించటం లేదు. జిల్లాలోని 46 ఎంఈవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఐదు ఉపవిద్యాశాఖ అధికారి పోస్టులు సైతం భర్తీ కాలేదు. తణుకు డీవైఈవోగా తేతలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, కొయ్యలగూడెం డీవైఈవోగా అక్కడి హైస్కూల్ హెడ్మాస్టర్, భీమవరం డీవైఈవోగా ఉండి ఎంఈవో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఎంఈవో, ఉప విద్యాశాఖ అధికారి పోస్టులన్నీ ప్రధానోపాధ్యాయులతో కొనసాగిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులపై బాధ్యతలు పెరిగి ఒక్కపనీ పూర్తికానీ పరిస్థితి నెలకొంటోంది.
పోస్టులు భర్తీ చేయాలి
ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేసే ముందు ఎంఈవో, డీవైఈవో పోస్టులను భర్తీ చేయాలి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వేసవి సెలవుల్లోనే ప్రణాళిక ప్రకారం వాటిని సరఫరా చేయాలి. విధానాల్లో మార్పులు చేయకుండా ఉపాధ్యాయులపై నిందలు వేయటం సరికాదు.
- షేక్ సాబ్జి, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా శాఖ
నాణ్యత లేని దుస్తులే
యూనిఫామ్స్ కుట్టుకూలీ జతకు రూ.40 ఇస్తే ఎవరు కుడతారు. డ్వాక్రా మహిళలకో, ఇతరులకో ఇస్తే నాణ్యతలేని దారాలు, బటన్స్‌తో కుడితే ఎన్నిరోజులు ఉంటాయి. పైగా విద్యార్థికి వ్యక్తిగత కొలతలతో కాకుండా అందరికీ ఒకేలా కుట్టిస్తే ఎలా. యూనిఫామ్స్ 9, 10 తరగతుల విద్యార్థులకూ ఇవ్వాలి కదా.
- గుగ్గులోతు కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ
గురువుల్లో గుబులు.. అధికారులకు దిగులు
Published Tue, Aug 4 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement