![భూముల సేకరణలో వ్యాపార దృక్పధం: ధర్మాన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81418116972_625x300.jpg.webp?itok=Utkcrb2S)
భూముల సేకరణలో వ్యాపార దృక్పధం: ధర్మాన
హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణలో వ్యాపారం దృక్పధం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. రాజధాని ఏర్పాటు వల్ల దక్కే ప్రయోజనాలు రైతులకు మాత్రమే చెందాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ప్రకటన ద్వారా ఇందులో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. రాజధాని నిర్మాణం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. చట్టాలు ఉన్నది పేదల ప్రయోజనాల కోసంమేనని చెప్పారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాలలోని చాలా మంది రైతులలో అయోమయ స్థితి నెలకొందని ధర్మాన పేర్కొన్నారు.
రాజధాని ల్యాండ్ పూలింగ్పై ప్రభుత్వ విధాన ప్రకటనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాజధాని పేరుతో వ్యాపారం చేస్తే తాము ఊరుకోం అన్నారు. అన్ని విధాలుగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు ప్రధాన కంపెనీలు రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు అర్ధమవుతోందన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రైవేటు వ్యక్తుల కడుపు నింపడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణి ప్రమాదకరమైనదని, చట్టబద్దతలేని వ్యవహారాలు శ్రేయస్కరం కాదని ధర్మాన హితవుపలికారు.
**