
Dharmana Prasada Rao: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు సచివాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి, అమరావతి: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: చెప్పాడంటే.. చేస్తాడంతే..
గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ‘‘రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని’ మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
ధర్మాన ప్రసాదరావు రాజకీయ నేపథ్యం:
1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్‌పారీ్టలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్‌సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు.