స్వతంత్రం రాక ముందు మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చాక కర్నూలుకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. పరిపాలనా వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాల వాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. అలా ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పాలనా రాజధానిగా త్వరగా, తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు.
జూన్ 2, 2014. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ (రీ–ఆర్గనైజేషన్ యాక్ట్, 2014) అమలులోకి వచ్చిన రోజు. ఈ చట్టం చేసే ముందు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విధివిధానాల పరిశీలన కోసం కేంద్ర ప్రభు త్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2010 ఫిబ్రవరి నుంచి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించింది. పది నెలలు పర్యటించి చేసిన అధ్యయనంలో వివిధ అంశాలను ప్రస్తా విస్తూ నివేదికను సమర్పించింది.
తొలుత రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరడానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఆర్థిక, సామాజిక పరిపాలనా అంశాల్లో కొన్ని భద్రతలు కల్పించడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకటి కావడం, ఆ తర్వాత తెలంగాణతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం వంటి పరిణామాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగు తుందని, ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొ న్నారు. సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు నాటి నుండి ఆరు నెలల లోపు ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు, సిఫారసులు చేస్తుందని ఉంది.
తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రతన్ రాయ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ డైరెక్టర్)ను, సభ్యులుగా ఆరోమార్ రెవి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్), శ్రీ జగన్ షా (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్), ప్రొఫెసర్ కె. రవీంద్రన్ (న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్)లను నియమించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఈ కమిటీకి అపార అనుభవం ఉంది.
ఈ కమిటీ రాష్ట్రంలో 11 జిల్లాలు పర్యటించి ప్రజలను ప్రజా సంఘాలను కలిసింది. వారితో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. 4728 ప్రజా విజ్ఞప్తుల్ని పరిశీలించి వాటన్నింటినీ క్రోడీకరించింది. 187 పేజీలతో తన నివేదికను నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ‘‘హైదరాబాద్‌లో కమిషనరేట్‌లు, డైరెక్టరేట్‌లతో కూడిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు; మంత్రిత్వ శాఖల కేంద్రీకరణకు అనేక సంవత్సరాలు పట్టింది.
అన్నేళ్లుగా రాజధాని పేరిట హైదరాబాద్‌లో జరిగిన ఈ కేంద్రీకృత అభివృద్ధే విభజన డిమాండ్‌కు కీలకాంశం. కాబట్టి ఒకే ఒక పెద్ద రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యం కాదు’’ అని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడింది. అలాగే గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మాణం మొదలు పెట్టడం) రాజధాని కూడా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆనాటి ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. పైగా అత్యంత విచారకరమైన విషయమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో భూలభ్యత గురించి అడిగినప్పుడు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించకపోవడం!
అసలు కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఒక అభిప్రాయానికొచ్చి విభజన చట్టానికి వ్యతిరేకంగా తానే ఒక కమిటీ నియమించుకుంది. అర్హతలూ, అనుభవం, నైపుణ్యం ఏ మాత్రం లేని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అందులో సభ్యులుగా ఉన్న వారిని చూస్తే వారి ఆలోచన, సామర్థ్యం, రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదనుకునే బాధ్యతా రాహిత్యం, ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది.
సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బొమ్మిడాల శ్రీనివాస్, జీవీకే సంజయ్ వంటివారు ఆనాటి కమిటీ సభ్యులు. రాజ్యాంగబద్ధంగా, శాసన సమ్మతంగా ఏర్పాటైన శివరామ కృష్ణన్ నివేదికను తొక్కిపెట్టి, ఏ చట్టంలోనూ పేర్కొనని నారాయణ కమిటీని అడ్డం పెట్టుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు! దాని కోసం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చట్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య.
రాజ్యాంగ సభలో 1949 మే 27న ‘రాజధాని ఎక్కడ ఉండాలి?’ అనే విషయంపై చర్చ జరిగినా, రాజ్యాంగంలో ప్రస్తావన జరగలేదు. రాజధాని ఒకటే ఉండాలని గాని, ఒకే చోట ఉండాలి గాని ఎక్కడా నిర్దేశించలేదు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు ఒకేచోట ఉండాలని నిర్ణయించలేదు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి అనుకూల మని భావించిన చోట పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు విచారణలు ఎక్కడ జరపాలో నిర్ణయించే అధికారం ఉంది.
వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు సూచించమని రిటైర్డ్ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానత లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర సమగ్రా భివృద్ధిని సూచిస్తూ తన నివేదికను 2019 డిసెంబర్ 20న ప్రభుత్వానికి సమర్పించింది.
ఆ కమిటీ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ విశాఖపట్నంలో; రాష్ట్ర శాసన సభ, హైకోర్ట్ బెంచ్, మినిస్టర్స్ క్వార్టర్స్ అమరావతి, మంగళగిరిల్లో; హైకోర్ట్ ప్రిన్సిపల్ సీట్, సంబంధిత కోర్టులు కర్నూలులో పెట్టాలని సూచించింది.
అసలు ఈ పరిపాలన వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాలవాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. ఆ ఆకాంక్షలు, కోరికలు తీరే రోజులు సమీపిస్తున్నాయని పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పరిపాలన రాజధానిగా అతి త్వరగా తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు.
రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో ఇతర రాష్ట్రాలు, దేశాలతో విశాఖపట్నం అనుసంధానం కలిగి ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది. అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలలోని చాలా కంపెనీలు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. విశాఖపట్నం మొదటి నుంచీ జీడీపీకి కీలక వాటాను అందిస్తున్నా తిరిగి తగినంత ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరగడం లేదు.
ఇప్పుడు మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఐదేళ్లు పాలన ఒక కల లాగే మిగిలిపోయి, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ముందు నిలబడ్డాం. మన ముందు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శివరామకృష్ణన్ రిపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ ఒకటే సూత్రమనే తారకమంత్రం వినిపిస్తోంది. సమాన అభివృద్ధి అనే విధానాన్ని పట్టిం చుకోకపోతే భవిష్యత్తు పట్ల యువత ఆశలు కునారిల్లిపోతాయి.
ప్రజా స్వామ్య ప్రభుత్వంపట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది. స్వతంత్రం రాక ముందు నుండి మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూ లుకు, ఏపీ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.
-వ్యాసకర్త: ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment