గుంపుల గొడవలు.. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటికే దుకాణం మూసేసే ముప్పును ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు నానాయాతన పడుతోంది. అధ్యక్షుడు, కోశాధికారి పదవులు మినహాయిస్తే, ప్రతి పదవికీ ముగ్గురు ఆపైనా నేతలకు అవకాశం కల్పించింది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: గుంపుల గొడవలు.. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటికే దుకాణం మూసేసే ముప్పును ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు నానాయాతన పడుతోంది. అధ్యక్షుడు, కోశాధికారి పదవులు మినహాయిస్తే, ప్రతి పదవికీ ముగ్గురు ఆపైనా నేతలకు అవకాశం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాలుగు రోజుల కిందట ప్రకటించిన కార్యకవర్గంలో ఆయా పదవులకు ఎంపిక చేసిన వారి సంఖ్యను చూస్తే ఔరా! అని అనిపించక మానదు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రధాన కార్యదర్శి పోస్టు కు ముగ్గురిని నియమించినప్పుడే పార్టీ నాయకుల్లో విమర్శలు పెల్లుబికాయి. ఏ నాయకుడికి ఆ నాయకుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా ఇష్టానుసారం పదవుల భర్తీకి పేర్లు ఇచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో టీడీపీ చిక్కుకుంది. నాలుగేళ్లుగా కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించుకోలేని దుస్థితి నుంచి బయటపడి ఇటీవల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది.
జిల్లా అధ్యక్షుడిని నియమించాక జిల్లా కార్యవర్గాన్ని భర్తీ చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్న నాయకత్వం చివర కు ఎవరూ ఊహించనంత మందికి చోటు కల్పిం చింది. జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఇంత మందిని భర్తీ చేయడంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని మొత్తం మండలాల సంఖ్య 59. అయితే, టీడీపీ జిల్లా కార్యదర్శులుగా 74మందికి అవకాశం కల్పిం చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, జిల్లా కార్యవర్గానికి ఏపాటి విలువ ఉందో, టీడీపీ జిల్లా పదవి ఏపాటి స్థాయిదో అర్థం చేసుకోవడానికి. అదే మాదిరిగా, 20మంది ఉపాధ్యక్షులు, 35మంది కార్యనిర్వాహక కార్యదర్శులను నియమించింది.
ఇక, ఏ పార్టీలోనైనా అధికార ప్రతినిధి అంటే పార్టీ విధానాలను, ఆయా అం శాలపై స్పందనను తెలియజేసేందుకు ఇద్దరు ముగ్గురిని నియమించడం సర్వసాధారణ విష యం. కానీ, టీడీపీ నాయకత్వం ఏకంగా 10 మందికి అధికార ప్రతినిధులుగా పదవులు కట్టబెట్టింది. ఏ పార్టీలోనైనా ప్రచార కార్యదర్శి పదవి సాధారణంగా ఒకటే ఉంటుంది. కానీ, జిల్లా ప్రచార కార్యదర్శులుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. చివరకు పార్టీ కార్యాలయ కార్యదర్శి పదవినీ ఇద్దరికి పంచారు. జిల్లా కార్యవర్గంలో పదవుల పంపకం పూర్తిగా ఆ పార్టీ ఆత్మరక్షణ ధోరణిని చూపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.