జూపాడుబంగ్లా: నిరుద్యోగుల ఆశలను కొందరు యువకులు సొమ్ము చేసుకున్నారు. కం పెనీ ఉద్యోగాలని.. లక్షల్లో జీతాలని నమ్మబలికి ఏకంగా 600 మందిని బురిడీ కొట్టించారు. చదువుతో పనిలేదని.. వయసుతో నిమిత్తం లేదంటూ ఒక్కొక్కరి నుంచి రూ.8వేలు చొప్పున వసూలు చేశారు. శిక్షణ పేరిట మరో రూ.8వేలు గుంజారు. సుదూర రాష్ట్రాల్లో రెండు మూడు నెలలు నిర్బంధించి నరకం చూపారు.
తాము మోసపోయామని తెలుసుకుని అక్కడి నుంచి బయటపడిన బాధితులు కొందరు శనివారం జూపాడుబంగ్లా ఎస్‌ఐ గోపినాథ్ ఎదుట తమ గోడు వినిపించారు. వివరాల్లోకి వెళితే.. జలకనూరు గ్రామానికి చెందిన పాణ్యం వేణుగోపాల్, షేక్‌అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్ అనే యువకులు తాము గ్లాజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నామని జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో స్నేహితుల ద్వారా నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నారు.
రూ.8వేలు చెల్లిస్తే తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో జూపాడుబంగ్లా మండలంలోని తరిగోపుల, 80.బన్నూరు గ్రామాలతో పాటు పాములపాడు మండలంలోని చెలిమిల్ల, లింగ ాల, కొత్తబానకచర్ల, మిడ్తూరు మండలంలోని జలకనూరు, గూడూరు తదితర గ్రామాలకు చెందిన సుమారు 600 మంది వారి మాయలో పడ్డారు. ఒక్కొక్కరి నుంచి రూ.16వేలు చొప్పున దాదాపు రూ.కోటి వసూలు చేశారు. నమ్మించేందుకు కొందరికి గుర్తింపు కార్డులను సైతం ఇచ్చేశారు.
గత మార్చిలో కొందరు యువకులను శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ వద్దనున్న గాజ్‌పూర్‌లో రెండు నెలలు, బీహార్‌లో రెండు నెలలు నిర్బంధిం చారు. చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న యువకులు తల్లిదండ్రుల ద్వారా బ్యాంకుల్లో నగదు వేయించుకుని ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే గూడూరుకు చెందిన శివ అనే వ్యక్తి శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి ఇప్పటికీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గత రెండు రోజులుగా బాధితులు జూపాడుబంగ్లా ఎస్‌ఐ గోపినాథ్‌ను కలిసి తమ గోడు వినిపిస్తున్నారు. శనివారం కొత్తబానకచర్లకు చెందిన నాగభూషణం, లింగాలకు చెందిన చిన్నకొలమయ్య, అశోక్‌లు ఎస్‌ఐని కలిసి మోసపోయిన తీరును వివరించారు. అనంతరం ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.
ఇప్పటికే షేక్‌అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్‌లను అదుపులోకి తీసుకోగా.. వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. అదుపులోని ముగ్గురు యువకులు తాము కూడా మోసపోయామని చెబుతున్నారని.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరుస్తామన్నారు.
చదువక్కర్లేదు.. వయసుతో పన్లేదు!
Published Sun, Nov 30 2014 3:56 AM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM
Advertisement
Advertisement