కాగ్ అభ్యంతరాలపై వివరణలివ్వండి: భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల అమలు తీరు, నిధుల వినియోగంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇవ్వాలని ప్రజా పద్దుల సమితి(పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఏసీ ప్రాధామ్యాలను చైర్మన్ భూమా అధికారులకు వివరించారు. సమావేశంలో ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధనరెడ్డి(వైఎస్సార్‌సీపీ), తోట త్రిమూర్తులు, పీవీజీఆర్ నాయుడు(టీడీపీ), విష్ణుకుమార్ రాజు (బీజేపీ), పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఫిబ్రవరి 5న పీఏసీ విశాఖపట్నం వెళ్లనుంది.
6న భీమిలిలో ఏర్పాటు చేసిన పర్యాటక రిసార్టులపై వచ్చిన ఆడిట్ అభ్యంతరాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అనంతరం, గంగవరం నౌకాశ్రయం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల అమలు తీరును సమీక్షిస్తుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై నీటిపారుదల, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర శాఖలపై కూడా సమీక్షించనున్నట్లు తెలిసింది. కాగా, గురువారం జరగాల్సిన రెండోరోజు పీఏసీ భేటీ రద్దయింది.