
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేందుకు కేంద్రం చేపట్టిన ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ఆయకట్టుకు వేగంగా నీళ్లందించడాన్ని పక్కనబెట్టి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చటంపైనే ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపారని పేర్కొంది. ఏఐబీపీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు అక్షర సత్యమని తేలుస్తూ కాగ్ నివేదిక ఇచ్చింది.
రూ.79.04 కోట్లు నిరుపయోగం
దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేందుకు కేంద్రం ఏఐబీపీని చేపట్టింది. ఏఐబీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు కేంద్రం తన వాటాగా కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరి కొన్ని చోట్ల 30 శాతం, గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 90 శాతం నిధులను సమకూర్చుతుంది.
రాష్ట్రంలో 12 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు ఈ పథకం కింద కేంద్రం నిధులను కేటాయించింది. అయితే ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంచనా వ్యయాన్ని పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించి కమీషన్లు వసూలు చేసుకోవడంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు సఫలమయ్యారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల రూ.79.04 కోట్లు నిష్ఫలమయ్యాయని కాగ్ తేల్చింది.
తాడిపూడిపై తాత్సారంతో రూ.191 కోట్ల భారం
తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని 2004లో రూ.376.96 కోట్లతో చేపట్టారు. ఈ పథకం కింద 2,06,600 ఎకరాలకు నీళ్లందించాల్సి ఉండగా 2009 నాటికే 1.54 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి మిగిలిన 52 వేల ఎకరాలకు నీళ్లు అందించడంపై టీడీపీ సర్కారు మీనమేషాలు లెక్కించింది. అంచనా వ్యయాన్ని రూ.885.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్దేశించిన మొత్తం కన్నా రూ.191.04 కోట్ల అధికంగా ఖర్చు అయ్యాయని కాగ్ తూర్పారబట్టింది.
గుండ్లకమ్మలో గుండె గుభేల్..
గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 80,060 ఎకరాలకు నీళ్లందించాలి. గతంలోనే రూ.535.01 కోట్లు ఖర్చు చేసి 68,948 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. భూసేకరణలో జాప్యం వల్ల 11,500 ఎకరాలకు నీళ్లందించలేకపోయారు. మిగిలిన భూసేకరణను చేసి ఆయకట్టుకు నీళ్లందించాల్సిన సర్కార్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.753.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని కాగ్ తప్పుబట్టింది. ఇక డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు ధరలను తప్పుగా లెక్కించడం వల్ల కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ.1.49 కోట్ల లబ్ధి కలిగించిందని స్పష్టం చేసింది.
తారకరామతీర్థ సాగర్‌పై తీవ్ర జాప్యం..
తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును 2003లో రూ.220.11 కోట్లతో చేపట్టారు. 5.80 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 24,710 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు రూ.144.28 కోట్లను ఖర్చు చేశారు. భూసేకరణ, అటవీ అనుమతుల్లో సర్కార్ జాప్యం చేయడంతో 2015లో అంచనా వ్యయం రూ.471.31 కోట్లకు పెంచేశారు. సర్కారు నిర్లక్ష్యంతో ఖజానాపై రూ.271.20 కోట్ల భారం పడింది. ఆయకట్టుకు నీళ్లందించడంలో జాప్యం వల్ల రైతులు నష్టపోయారని కాగ్ తేల్చింది.
వెలిగల్లులో భారం ఖజానాపైనే..
వెలిగల్లు రిజర్వాయర్ పూర్తి కాకుండానే పూర్తయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వల్ల మరమ్మతులకు అయ్యే రూ.16 కోట్ల భారం కాంట్రాక్టర్‌పై కాకుండా సర్కార్‌పై పడిందని కాగ్ పేర్కొంది.
భూసేకరణ జాప్యంతో నిధులు నీటి పాలు...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో భవవాసి చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే పనుల్లో భూసేకరణ జాప్యం వల్ల రూ.25.88 కోట్లు నిష్ఫలమయ్యాయని కాగ్ తేల్చింది.
ప్రకాశం బ్యారేజీ పనుల్లో కాంట్రాక్టర్‌కు లబ్ధి
ప్రకాశం బ్యారేజీ హెడ్‌వర్క్స్ ఆధునికీకరణ పనులను ఈపీసీ విధానంలో రూ.204.67 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందుల వల్ల విజయవాడ పరిధిలో రిటైనింగ్ గోడల నిర్మాణం, కాలువలకు సిమెంటు లైనింగ్ పనులను ఒప్పందం నుంచి తప్పించారు. ఈ పనుల విలువ రూ.86.41 కోట్లు కాగా జలవనరుల శాఖ రూ.64.45 కోట్లుగా లెక్క కట్టిందని కాగ్ గుర్తించింది. తొలగించిన పనుల స్థానంలో రూ.63.81 కోట్లతో కొత్తగా పనులు చేపట్టడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.22.60 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారని కాగ్ తప్పుబట్టింది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment