నెల్లూరులో ‘కాల్‌’కలం! | Call Money Case in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ‘కాల్‌’కలం!

Published Sun, Nov 26 2017 12:42 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Call Money Case in Nellore - Sakshi - Sakshi - Sakshi

మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎడమ వైపు ఉన్న అధికార పార్టీ నేత కోట గురుబ్రహ్మం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ బాగోతం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వ్యాపారులు, రియల్టర్లను టార్గెట్‌ చేసుకుని రూ.లక్షల్లో అప్పులు ఇచ్చి రూ.కోట్లలో వసూలు చేసే ఓ కాల్‌మనీ వ్యాపారిపై ఇప్పుడు ఫిర్యాదుల పరంపర మొదలైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడిగా నగరంలో హవా సాగిస్తూ.. అప్పులు తీసుకున్న వారిని వేధించి ఆస్తులు రాయించుకుంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కూడా ఇతనిపై వచ్చే ఫిర్యాదులను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. తాజాగా రెండు ఫిర్యాదులు వెలుగులోకి రావడం, అందులో ఒక ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు కావడంతో ఈ కాల్‌మనీ దందా వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లాకు చెందిన కోట గురుబ్రహ్మం నెల్లూరు నగరంలో స్థిరపడ్డాడు. సింహపురి పెయింట్స్‌ పేరిట వ్యాపార రంగంలోకి ప్రవేశించి వడ్డీ వ్యాపారం ద్వారా అనతి కాలంలోనే రూ.కోట్లు గడించాడు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు సన్నిహితుడు కావడంతో జిల్లాలో ఇష్టానుసారంగా దందా సాగిస్తున్నాడు. రూ.లక్షల్లో అప్పులిచ్చి కోట్లు వసూలు చేస్తూ కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనితోపాటు మరో ముగ్గురు అధికార పార్టీ చోటా నేతలు సిండికేటుగా ఏర్పడి పెద్ద మొత్తాలతో లావాదేవీలు నడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో నగరంలోని గోమతీ ఎడ్యుకేషన్‌ సొసైటీ కరస్పాండెంట్‌ అరుణ.. 2012లో గూడూరుకు చెందిన వడ్డీ వ్యాపారి వాయుగుండ్ల వెంకట నరసింహారావు వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.15 లక్షలు అప్పు తీసుకున్నారు. ష్యూరిటీగా తన భర్త పేరుతో చెక్కులు, ప్రామిసరీ నోట్లను ఇచ్చారు. ఈ క్రమంలో నరసింహారావు ఆ అప్పును మంత్రి అనుచరుడు కోట గురుబ్రహ్మంకు బదలాయించి అప్పును అతనికి చెల్లించాలని సూచించి తిరిగి గురుబ్రహ్మం, అతని కుమారుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ పేరుతో ప్రామిసరి నోట్లు, చెక్కులు తీసుకున్నారు. 2016లో అసలు, వడ్డీ చెల్లించారు. అయితే, ప్రామిసరీ నోట్లు, చెక్కులు కనిపించడంలేదని, కొద్ది రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి అప్పు రద్దయినట్లు కాగితం రాసిచ్చారు. రెండు నెలల తర్వాత చెక్కులు బౌన్స్‌ చేశారు. దీంతో అరుణ కోర్టులో ప్రైవేటు కంప్‌లైంట్‌ వేయడంతో ఈనెల 16న 4వ నగర పోలీసుస్టేషన్‌లో గురుబ్రహ్మంపై కేసు నమోదైంది. దీంతో అతని నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

మంత్రి అండతోనే దందా
సాధారణ పెయింట్‌ వ్యాపారి అయిన గురుబ్రహ్మం ఒక దశలో మంత్రికే చేబదులుగా అప్పులిచ్చే స్థాయికి ఎదిగాడు. 15 ఏళ్ల క్రితం వరకు మంత్రికి అనేకసార్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. కోట గురుబ్రహ్మంతోపాటు మంత్రికి సన్నిహితంగా ఉండే ఏలూరు శీనయ్య, కృష్ణయ్య, ప్రసాద్‌ సిండికేట్‌గా ఏర్పడి కాల్‌మనీ నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీరితో నిమిత్తం లేకుండా గురుబ్రహ్మం అప్పులు ఇస్తుంటాడు. అలాగే, నగరంలోని ధనలక్ష్మీపురానికి చెందిన బత్తుల విజయభాస్కర్‌రెడ్డి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి 2010లో 131 అంకణాల స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ జాగాలో అపార్టుమెంట్‌ నిర్మాణం కోసం మూడు రూపాయల వడ్డీకి గురుబ్రహ్మం వద్ద రూ.70 లక్షలు అప్పు తీసుకుని డెవలప్‌మెంట్‌ కోసం తీసుకున్న స్థలాన్ని ఆయన తల్లి శేషమ్మ పేరుతో అన్‌ రిజిస్టర్‌ చేశారు.

ఈ క్రమంలో అపార్టుమెంట్‌లో రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తిచేసి 12 మందికి విజయభాస్కర్‌రెడ్డి విక్రయించి ఆ డబ్బును బాకీ కింద జమ చేసుకోమని కోరగా కుదరదని చెప్పి అపార్టుమెంట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే వడ్డీతో కలిపి రూ.కోటి 76 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసి తనకు మంత్రి అండ ఉందని, ఏమీ చేయలేవని బెదిరించి పంపాడు. ఇదే క్రమంలో గూడూరులో, సర్వేపల్లి, నగరంలో అనేకమంది గురుబ్రహ్మం బాధితులు ఉన్నారు. మరోవైపు.. గోమతి నిర్వాహకురాలు అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అలాగే, విజయభాస్కర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగరంలో అనేకమంది వ్యాపారులు, అధికార పార్టీ నేతల సమీప బంధువులు కూడా ఇదే తరహాలో మోసం చేస్తున్నారు. మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడంలేదు. 2013లో ముత్తుకూరు పోలీసుస్టేషన్‌లో ఇతనిపై కేసు నమోదైంది.

కేసును విచారిస్తున్నాం
కోర్టు ఆదేశాల మేరకు కోట గురుబ్రహ్మంపై కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో విచారిస్తున్నాం. నకిలీ డాక్యుమెంట్లు, చెక్కుల ఫోర్జరీ చేసిన అభియోగాలపై విచారణ సాగుతోంది. ఫోరెన్సిక్‌ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. గురుబ్రహ్మం తన అనుచరుల ద్వారా బెదిరించినట్లు గోమతి విద్యా సంస్థల కరస్పాండెంట్‌ అరుణ ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ సాగుతోంది.
– వి.సుధాకర్‌రెడ్డి, నెల్లూరు నాలుగో నగర సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement