ఆ ముగ్గురూ..టార్గెట్! | call money sex rocket in three persons targetted | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ..టార్గెట్!

Published Sun, Jan 3 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

call money sex rocket in three persons targetted

ముందస్తు బెయిల్‌ను అడ్డుకునే యత్నాలు
పట్టివేతపై ప్రత్యేక బృందాల దృష్టి
 విజయవాడ సిటీ: 
కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులోని మిగిలిన నిందితుల పట్టివేతను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందస్తు బెయిల్‌కు వెళితే తలెత్తనున్న పరిణామాలు సత్యానందం అరెస్టు ద్వారా పరారీలోని నిందితులకు బోధపడేలా చేశారు.‘తమకు చిక్కడమో, లేక కొత్త కేసులకు సిద్ధపడటమో’ తేల్చుకోవాలనేది పోలీసుల సవాల్. పోలీసులను కాదని ముందస్తు బెయిల్‌కు వెళితే చేపట్టాల్సిన చర్యలను ముందుగానే సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.  నాలుగో నిందితుడు సత్యానందం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడంపై నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఆగ్రహంగా ఉన్నారు.

కమిషనరేట్ నుంచి పంపిన పోలీసు అధికారి బెయిల్‌పై వాదనలు జరిగే సమయంలో అక్కడ ఉండకుండా తిరిగొచ్చిన విషయాన్ని పోలీసు కమిషనర్ గుర్తించారు. మిగిలిన నిందితుల పట్టివేతలో ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై గట్టి చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు పరారీలోని నిందితుల విషయంలో పెద్దగా స్పందించని అధికారులు..వారుంటున్నట్టు అనుమానించే ప్రాంతాలకు ప్రత్యేక టీంలు పంపుతున్నారు. నిందితులతో సన్నిహితంగా మెలిగే వారిని అదుపులోకి తీసుకొని సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, బౌన్సర్ భవానీశంకర్, దూడల రాజేష్‌ను అరెస్టు చేయగా విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.

బెయిల్ పత్రాలు సమర్పించి కోర్టు నుంచి బయటి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు మరో కేసులో డీఈ సత్యానందంను అరెస్టు చేశారు. మిగిలిన వారిని మరి కొద్ది రోజుల్లో పరారీలోని ముగ్గురిని అదుపులోకి తీసుకుంటామని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పడాన్ని బట్టి పోలీసుల వ్యూహాలు అర్థమవుతున్నాయి.

 చిట్టాలు రెడీ
 పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్‌కు వెళితే చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పరారీలోని నిందితులపై పాత ఫిర్యాదులను తిరగతోడుతున్నట్టు తెలిసింది. గతంలో వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులపై కొందరు పోలీసులనాశ్రయించారు. తమకున్న పలుకుబడితో వారు కేసులు నమోదు కాకుండా తప్పించుకున్నట్టు పోలీసు కమిషనర్ గుర్తించారు. ఆయా ఫిర్యాదులను నిఘా వర్గాల ద్వారా తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

 జైళ్లశాఖ అధికారుల దృష్టికి
 తీవ్రమైన నేరాల్లో వచ్చే వారికి సకల సౌకర్యాలు కలిపిస్తున్న జైలు అధికారుల వ్యవహారాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో పోలీసు కమిషనర్ సవాంగ్ ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా మహిళల విషయంలో నేరాలకు పాల్పడిన వారికి ఎట్టి పరిస్థితుల్లోను ఏ ఒక్కరూ సహకరించకుండా చూడాలనేది పోలీసు పెద్దల నిర్ణయం. తద్వారా నిందితుల పట్ల కఠిన వైఖరి అవలంభించాలనే ఆలోచనలో ఉన్నారు.
 
 ముందస్తు బెయిల్‌కు అడ్డుపుల్ల
 పరారీలోని నిందితులు ముందస్తు బెయిల్ పొందకుండా పోలీసుశాఖ నుంచి అవసరమైన చర్యలు చేపట్టారు. వీరు బెయిల్ ఫిటీషన్లు దాఖలు చేస్తే అడ్డుకునేందుకు సమర్థవంతమైన వాదనలు వినిపించాలనేది పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఇదే సమయంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసుపై పోలీసుల సీరియస్‌నెస్‌ను చెప్పేందుకు సీనియర్ పోలీసు అధికారిని కోర్టుకు పంపాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులకు దీనిపై ప్రత్యేక తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది.
 
 సౌకర్యాలు కట్
 కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకొని జైలు అధికారులు నిందితులకు సహకరిస్తున్నారనేది పోలీసు ఉన్నతాధికారుల్లో నెలకొన్న అభిప్రాయం. అవసరమైన పక్షంలో వైద్యం చేయించాలంటూ మానవతా ధృక్ఫధంతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంటే..జైలు అధికారులు ఆదాయం సమకూర్చుకునే మార్గాలుగా మార్చుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. కాల్‌మనీ కేసులో అరెస్టు చేసిన మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్ పది రోజుల పాటు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పేరిట చేరారు. పోలీసులు దృష్టిసారించి తమ సిబ్బందిని భద్రత కోసం ఏర్పాటు చేసిన మరుసటి రోజే తిరిగి జైలుకు వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement