సాక్షి, హైదరాబాద్: మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటేనే ఆరోగ్యం. లయ తప్పి 100... 150 సార్లకు చేరుకుంటే ప్రమాదకర సంకేతాలే. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఒక రోగి హృదయ స్పందనలను ఇంటర్నెట్ సాయంతో నియంత్రించేందుకు హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన హృద్రోగ వైద్య నిపుణులు వెంకట్, నాగరాజన్ ఒక వినూత్న చికిత్స చేశారు. మంగళవారం విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన సంజీవ్(54) హృదయ స్పందనలు పరిమితికి మించి ఉండటంతో గత నెల 22న సన్‌షైన్ అస్పత్రిలో చేరాడు.
వైద్యులు సంజీవ్‌కు పలు పరీక్షలు చేసి మోచేయి రక్త నరాల ద్వారా గుండె సమీపంలో ‘ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిల్టర్ పరికరాన్ని అమర్చారు. చాతీ కింద చర్మం లోపల ఒక సంచిని ఏర్పాటుచేసి దానిలో ఒక బ్యాటరీ పెట్టి పరికరంతో అనుసంధానం చేశారు. ఈ రెండింటినీ యూనిక్ వైఫై పద్ధతిలో ఆస్పత్రిలో వైద్యుడి కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశారు. దీని ద్వారా రోగి ఎక్కడున్నా అతని గుండె లయ వేగం గుర్తించేందుకు వీలుంటుంది. గుండె వేగం అధికమైతే వైద్యుడి కంప్యూటర్ గుర్తించి సంకేతాలు ఇస్తుంది. దీంతో వైద్యనిపుణులు తక్షణమే రోగికి ఫోన్ ద్వారా సలహాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ ద్వారా హృదయ స్పందనల నియంత్రణ
Published Wed, Oct 2 2013 4:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement