హెల్త్‌: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! | Health: Have You Ever Noticed An Enlarged Heart? | Sakshi
Sakshi News home page

హెల్త్‌: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!

Published Sun, Mar 31 2024 8:27 AM | Last Updated on Sun, Mar 31 2024 9:12 AM

Health: Have You Ever Noticed An Enlarged Heart? - Sakshi

హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌

గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్‌లో హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్‌ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం.

రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్‌ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది.

గుండె పెరగడం.. రకాలు..
గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి..

  • డయలేటెడ్‌ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్‌) రెండూ పెరుగుతాయి.
  • అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి’ అంటారు.
  • ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్‌ డయలేటెడ్‌ కార్డియో మయోపతి అంటారు. 

కారణాలు..

  • గుండె కండరానికి ఇన్ఫెక్షన్‌ (మయోకారై్డటిస్‌) వచ్చేలా చేసే వైరల్‌ ఇన్ఫెక్షన్లు.
  • గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం.
  • గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌ అంటారు. దీన్ని ఎక్స్‌–రే ద్వారా కనుగొంటారు.
  • రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్‌ అయిన పెరిపార్టమ్‌ కార్డియోమయోపతి వల్ల.
  • కార్డియాక్‌ అమైలాయిడోసిస్‌ అనే కండిషన్‌లో రక్తంలో అమైలాయిడ్‌ ప్రోటీన్‌ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి).
  • దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో
  • థైరాయిడ్‌ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల
  • పల్మునరీ హైపర్‌టెన్షన్‌ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది.
  • కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు.

లక్షణాలు..

  • శ్వాస సరిగా అందకపోవడం
  • కాళ్ల / పాదాల వాపు
  • బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్‌ ఒబేసిటీ)
  • తీవ్రమైన అలసట
  • కొందరిలో గుండెదడ  లేదా గుండె లయ తప్పడం. 

నిర్ధారణ పరీక్షలు..
కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్‌–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్‌మిల్‌పై చేయించే స్ట్రెస్‌ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. 

చికిత్స..

  • గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు..
  • గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా.
  • రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా.
  • గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్‌లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా.
  • మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. 

ఇతర మందుల వాడకంతోనూ..
కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్‌తో
రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్‌ – కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్‌ వంటి మందులతో.
రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్‌తో.
గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్‌ అనే మందును వాడతారు.
గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌ డీ ఫిబ్రిలేటర్‌తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు.
గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్‌మేకర్‌’ అమర్చడం ద్వారా.
లెఫ్ట్‌ వెంట్రిక్యులార్‌ అసిస్ట్‌ డివైస్‌ (ఎల్‌వీఏడీ) అనే ఉపకరణాన్ని.
గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు.
గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్‌) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్‌ శస్త్రచికిత్సతో.
చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు.

ఇవి చదవండి: మెడి టిప్‌: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement