కెనడా చట్టసభలో తెలుగు తేజం | Canada Minister Telugu NRI Panda Prasad Interview With Sakshi | Sakshi
Sakshi News home page

కెనడా చట్టసభలో తెలుగు తేజం

Published Thu, Dec 26 2019 10:04 AM | Last Updated on Thu, Dec 26 2019 12:23 PM

Canada Minister Telugu NRI Panda Prasad Interview With Sakshi

భార్య శాంతిశ్రీ, కొడుకు హిమనీశ్‌తో ప్రసాద్‌

తెనాలి : పండా శివలింగ ప్రసాద్‌.. కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రంలో మౌలిక వసతుల మంత్రి. కాల్గరీ–ఎడ్మాంటన్‌ ఎమ్మెల్యే. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఆల్బర్టాను అప్పుల బారినుంచి గట్టెక్కించాలనేది తన మొదటి ప్రాధాన్యతగా చెబుతున్నారు. ఆయన విజయ ప్రస్థానంలోకి వెళితే.. శివలింగప్రసాద్‌ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడి. తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, వెంకట సుబ్బయ్య. ప్రసాద్‌కు ముగ్గురు అక్కలు, అన్నయ్య. ప్రసాద్‌ ఉయ్యూరులో అన్నయ్య వద్ద ఉంటూ ఇంటర్, విజయవాడలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆల్విన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ స్కూటర్స్‌ లిమిటెడ్‌లో ఓ ఏడాది, ఆ తరువాత ముంబైలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 1988 నుంచి 16 ఏళ్లు పనిచేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన జామ్‌నగర్‌ ఆయిల్‌ రిఫైనరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్‌ను ఆయిల్‌ నిక్షేపాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రం ఆకర్షించింది. దీంతో అక్కడి సంతూర్‌ ఎనర్జీలో చేరారు. పదకొండేళ్ల అనుభవం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల వైపు చూశారు. ప్రతిపక్ష వైల్డ్‌ రోజ్‌ పార్టీలో చేరి, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ తరువాత కాల్గరీ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్, ట్రేడ్‌కు షాడో మంత్రిగా వ్యవహరించారు. 

భారతీయులు 2 శాతం కూడా లేనిచోట.. 
2019 ఏప్రిల్‌ 16న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాల్గరీ–ఎడ్మాంటన్‌ నుంచి గెలుపొందిన ప్రసాద్‌ మౌలిక వసతుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో 75 శాతం ప్రజలు తెల్లవాళ్లు. 16 శాతం చైనీయులు. ఇండియా నుంచి రెండు శాతం కూడా ఉండరు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రసాద్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయిల్, గ్యాస్‌ రంగ నిపుణుడిగా సుదీర్ఘకాలం అక్కడ పనిచేసిన అనుభవంతో స్థానికులు తనను ఆదరించారని చెప్పారు. కుల మతాలు, ప్రాంత వ్యత్యాసాలను ప్రజలు చూడరని, అభ్యర్థుల చరిత్ర, సమర్థతలను బేరీజు వేసుకుని, సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని వివరించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టటం, అప్పులు తగ్గించి, బడ్జెట్‌ను బ్యాలెన్స్‌ చేసే పనిలో ఉన్నామని చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement