telugu nri
-
సముద్రాలు దాటిన తెలుగోళ్ల ప్రతిభ
-
కెనడా చట్టసభలో తెలుగు తేజం
తెనాలి : పండా శివలింగ ప్రసాద్.. కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రంలో మౌలిక వసతుల మంత్రి. కాల్గరీ–ఎడ్మాంటన్ ఎమ్మెల్యే. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఆల్బర్టాను అప్పుల బారినుంచి గట్టెక్కించాలనేది తన మొదటి ప్రాధాన్యతగా చెబుతున్నారు. ఆయన విజయ ప్రస్థానంలోకి వెళితే.. శివలింగప్రసాద్ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడి. తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, వెంకట సుబ్బయ్య. ప్రసాద్‌కు ముగ్గురు అక్కలు, అన్నయ్య. ప్రసాద్ ఉయ్యూరులో అన్నయ్య వద్ద ఉంటూ ఇంటర్, విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. హైదరాబాద్‌లో ఆల్విన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ స్కూటర్స్ లిమిటెడ్‌లో ఓ ఏడాది, ఆ తరువాత ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 1988 నుంచి 16 ఏళ్లు పనిచేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన జామ్‌నగర్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్‌ను ఆయిల్ నిక్షేపాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రం ఆకర్షించింది. దీంతో అక్కడి సంతూర్ ఎనర్జీలో చేరారు. పదకొండేళ్ల అనుభవం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల వైపు చూశారు. ప్రతిపక్ష వైల్డ్ రోజ్ పార్టీలో చేరి, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ తరువాత కాల్గరీ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎకనమిక్ డెవలప్మెంట్, ట్రేడ్‌కు షాడో మంత్రిగా వ్యవహరించారు. భారతీయులు 2 శాతం కూడా లేనిచోట.. 2019 ఏప్రిల్ 16న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాల్గరీ–ఎడ్మాంటన్ నుంచి గెలుపొందిన ప్రసాద్ మౌలిక వసతుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో 75 శాతం ప్రజలు తెల్లవాళ్లు. 16 శాతం చైనీయులు. ఇండియా నుంచి రెండు శాతం కూడా ఉండరు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయిల్, గ్యాస్ రంగ నిపుణుడిగా సుదీర్ఘకాలం అక్కడ పనిచేసిన అనుభవంతో స్థానికులు తనను ఆదరించారని చెప్పారు. కుల మతాలు, ప్రాంత వ్యత్యాసాలను ప్రజలు చూడరని, అభ్యర్థుల చరిత్ర, సమర్థతలను బేరీజు వేసుకుని, సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని వివరించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టటం, అప్పులు తగ్గించి, బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నామని చెప్పారు. -
ఫెడరల్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి
సిడ్నీ : భారత సంతతికి చెందిన లివింగ్స్టన్ చెట్టిపల్లి ఆస్ట్రేలియాలో జరగబోయే ఫెడరల్ ఎన్నికల్లో చిఫ్లే నుంచి లిబరల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన లివింగ్స్టన్ ఆస్ట్రేలియాలోని డూన్సైడ్లో భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. లివింగ్స్టన్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మిషనరీ స్కూల్లో ఉపాధ్యాయులగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సేఫ్మ్యాఫ్ ఐఎన్సీలో సీఈఓగా పనిచేస్తున్నారు. గతంలో కమ్యూనిటీ రీసోర్స్ నెట్‌వర్క్‌లో ఎగ్జీక్యూటీవ్ ఆఫీసర్‌గా, ఎస్ఈఆర్పీ ప్రాజెక్టు మేనేజర్‌గా, స్మాల్ అండ్ ఎమర్జింగ్ కమ్యూనిటీస్ వర్కర్‌గా మెట్రో అసిస్ట్‌లో పనిచేశారు. బ్లాక్‌టౌన్ మల్టీకల్చరల్ అడ్వెజరీ కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు. -
అమెరికాలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం
వాషింగ్టన్ డీసీ: గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్నారై ప్రవీణ్ తుమ్మపల్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. వర్జీనియా రాష్ట్రం వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని అల్దీ నగరంలో నివసిస్తున్న ఆయన ఈ నెల 22న ఛాతినొప్పి వస్తుందంటూ అమాంతం కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకుపోయేలోపే గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లా పేర్వాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ వయస్సు 45 ఏళ్లు. 1990లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆయన వాషింగ్టన్ డీసీలోని సీజీఐ ఫెడరల్ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ తుమ్మపల్లి మృతిపట్ల అమెరికాలోని తెలుగువారు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, ఇక్కడి తెలుగువారికి తీరని లోటు అని ప్రవీణ్ ఆప్తమిత్రుడు యుగంధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు నల్లగొండలో ఉన్నందున స్వదేశానికి ఆయన భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శనార్థం ప్రవీణ్ భౌతికకాయాన్ని బుధవారం (26న) అలెగ్జాండ్రియాలోని జెఫర్సన్ ఫ్యునరల్ చాపెల్‌లో ఉంచనున్నామని, ప్రవీణ్ తుమ్మపల్లి భౌతికకాయం అంత్యక్రియల నిమిత్తం గురువారం స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన మిత్రులు తెలిపారు. ప్రవీణ్‌కు భార్య పావని, 10, 14 ఏళ్ల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ఘనంగా ‘టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల’
డాలస్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఆదివారం (డిసెంబర్17న) ఘనంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొని.. జయప్రదం చేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సదస్సు నిర్వహించటం విశేషం. కార్యక్రమంలోముందుగా ప్రముఖ సినీ గాయని నూతన, మోహన్ ప్రార్థనాగీతం ఆలపించారు. కొరివిచెన్నారెడ్డి కంకటిపాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని ‘అన్నదానఫలమహాత్యం’ పురాణపఠనంచేశారు. పాలపర్తి ఇంద్రాణి125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగువారి ఉత్తమ జీవనవిధానం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాలపర్తి ఇంద్రాణి రచించిన మూడోకవితాసంకలనం,'ఇంటికొచ్చిన వర్షం'; తల్లీపిల్లల హృద్యమైన సంభాషణలపుస్తకం 'చిట్టిచిట్టిమిరియాలు', మొదటినవలిక 'ఱ' ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ‘సింహావలోకనం’ లో 2017సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు నెలనెలా జరిగిన సాహిత్యసదస్సులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, శీలం కృష్ణవేణి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, కోడూరు కృష్ణారెడ్డి, తెలకపల్లిజయ, కర్రిశశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మారిషస్ లో వేంకటేశ్వర స్తోత్రాలు
మాతృభూమికి దూరంగా ఉంటున్నప్పటికీ మారిషస్ లోని తెలుగువారు తమ సంప్రదాయాలను పదిలంగా కాపాడుకుంటున్నారు. పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఉనికిని చాటి చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రవాస తెలుగువారిని భక్తిసాగరంలో ఓలలాడించింది. మారిషస్ చరిత్రలో తొలిసారిగా చిన్నారులతో శ్రీ వేంకటేశ్వరస్వామి స్తోత్రముల ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 నుంచి 13 ఏళ్ల బాల బాలికలు 450 మంది రాగ, తాళ, భావ, అర్థయుక్తంగా ఆలాపించిన స్తోత్రములు భక్తులకు వీనులవిందు చేశాయి. జూలై 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాసులకు పరమానందం కలిగించింది. లేస్కలియే, వల్లెట్ట, పాంప్లెముసేజ్ తెలుగు సంఘాలు ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో ఎంపిక చేసిన చిన్నారులకు తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల, హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, భద్రాచలంలో పాడేందుకు చిన్నారులకు అవకాశమిచ్చారు.