పోలియో నిర్మూలనకు సహకరించాలి
Published Fri, Jan 10 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
బెలగాం, న్యూస్‌లైన్:పోలియో నిర్మూలనకు ప్రజలు సహకరించాలని వ్యాధి నిరోధక, టీకాల జిల్లా అధికారి డాక్టర్ ఎం. కిశోర్‌కుమార్ కోరారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో పార్వతీపురం డివిజన్‌లో గల ‘పల్స్‌పోలియో’ రూట్ సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 19న బూత్‌కేంద్రాల వద్ద 20, 21తేదీలలో ఇంటింటికీ వెళ్లి 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.
రెండు లక్షల 22 వేల మంది చిన్నారులకు చుక్కల మందు
జిల్లా వ్యాప్తంగా 2,22,572 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్క చిన్నారికీ చుక్కల మందు వేయాలని, ఈ విషయంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1600 బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 160 మంది సూపర్‌వైజర్లు, రూట్ ఆఫీసర్లు, గ్రామాల్లో 3,200 బృందాలు, మెడికల్ ఆఫీసర్లతో 66 మొబైల్ టీమ్‌లు, మెడికల్, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆశ, తదితర విభాగాల నుంచి 6,400 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతంలో 38,832 మంది పిల్లలు లక్ష్యం కాగా 497 బూత్‌లు 994 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఎన్‌సీ ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ ఎం.నారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చొక్కాపు రామారావు, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ.లక్ష్మణమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్. కృష్ణమోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement