రిబేటు రద్దు గొడ్డలిపెట్టు | Cancel the rebate to handloom area | Sakshi
Sakshi News home page

రిబేటు రద్దు గొడ్డలిపెట్టు

Published Sun, Sep 29 2013 2:02 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

Cancel the rebate to handloom area

సాక్షి, కాకినాడ / న్యూస్‌లైన్, రాయవరం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని లాభాలబాట పట్టిన చేనేత సంఘాలు కేంద్ర సర్కారు నిర్ణయంతో మళ్లీ నష్టాలబాటపట్టే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్‌తో పాటు పలు పథకాలకు అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ(డీబీటీ)ని చేనేత రంగంలోనూ అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై కనీస కసరత్తు కూడా చేయకుండానే ఈ రంగంలో పలు రాయితీలకు మంగళం పాడుతోంది. చేనేత రంగంలో డీబీటీని అమలు చేస్తున్నట్టు సూత్రప్రాయంగా ప్రకటించిన కేంద్రం తాజాగా రిబేట్ పథకానికి మంగళం పాడింది. ఈ నిర్ణయం సంఘాలతో పాటు చేనేత కార్మికులకు అశనిపాతంగా మారింది. రిబేట్ రద్దుతో గత ఏడు నెలల్లో జిల్లాలో రూ.75 లక్షలకు పైగా అమ్మకాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఉత్పత్తి పడిపోయి  కార్మికులు పస్తులుండే పరిస్థితులు దాపురించాయి. 
 
 ఒక పక్క రోజురోజుకూ పెరుగుతున్న నూలు, ముడిసరుకు ధరలతో కునారిల్లుతుండగా రిబేట్ రద్దు ఈ రంగం ఉనికినే      ప్రశ్నార్థకం చేసింది. చిల్లర అమ్మకాల్ని ప్రోత్సహిం చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం రిబేట్ (రాయితీ) ఇస్తాయి. కార్మికులు నేసిన వస్త్రాలను చేనేత సంఘాలు నేరుగా విక్రయిస్తే 20 శాతం రిబేట్ పొందవచ్చు. అదే ఆప్కోకు విక్రయిస్తే పది శాతం రి బేట్ లభిస్తుంది. మరో పది శాతం వినియోగదారుల కు ఆప్కో రాయితీ ఇస్తుంది. జిల్లాలోని 50 సం ఘాల్లో 47 సంఘాలు 20 శాతం రిబేట్‌ను పొం దేం దుకు అర్హత కలిగి ఉన్నాయి. దసరా, దీపావళి తది తర పర్వదినాల సమయంలో సంఘాలు రిబేట్‌తో వస్త్రాలు విక్రయిస్తుంటాయి. తద్వారా నిల్వలను అమ్ముకునేందుకు సంఘాలకు అవకాశం లభిస్తుంది.
 
 12 వేల మంది నేత కార్మికులపై ప్రభావం
 జిల్లాలో 47 సంఘాల పరిధిలోని 12 వేల మంది నేత కార్మికుల ఉపాధిపై రిబేట్ రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంఘాల పరిధిలో ఏటా రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిపై 20 శాతం రిబేట్ చొప్పున సంఘాలకు రూ.60 లక్షల వరకు రాయితీ లభించేది. ఈ సొమ్ముతో సంఘాల పరిధిలోని కార్మికులకు కొంత వరకు ఊరట లభించేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒకేసారి రూ.60 లక్షల వరకు రాయితీ సొమ్ము కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో సంఘాలు మళ్లీ నష్టాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. చేనేత రంగంలోనూ నగదు బదిలీని అమలు చేయాలన్న సంకల్పంతోనే రిబేట్‌ను ఎత్తివేసిందని చెబుతున్నారు. సంఘాల్లో జరిగే ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని రిబేట్ మొత్తాన్ని నేరుగా సంబంధిత చేనేత కార్మికుని ఖాతాలో వేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల కాకుండానే రిబేట్‌ను ఎత్తివేయడం సబబు కాదని చేనేత రంగ నిపుణులు చెబుతున్నారు. ముందుచూపు లేని ఇలాంటి నిర్ణయాలు ఈ రంగం మనుగడపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 విడుదల కాని రూ.12.20 కోట్ల బకాయిలు 
 రిబేట్ పథకం కేంద్రం ప్రవేశపెట్టిందే అయినా 20 శాతం రిబేట్‌లో 10 శాతం కేంద్రం, మరో 10 శాతం రాష్ర్టం భరించేవి. ఆ మేరకు ఆ రాయితీ సొమ్ము ప్రతి మూడు నెలలకొకసారి నేరుగా సంబంధిత చేనేత సహకార సంఘాలకు జమయ్యేది. ఇక నూలు పై 10 శాతం రిబేట్ పథకం పూర్తిగా రాష్ర్టప్రభుత్వానిదే. ఈ విధంగా జిల్లాలో ఉన్న సంఘాలకు రావాల్సిన రాయితీ, నూలుపై రిబేటు సొమ్ము గత కొన్నేళ్లుగా సక్రమంగా విడుదల కావడం లేదు. 2010 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని సంఘాలకు రూ.12.20 కోట్లకు పైగా రావలసి ఉంది. రిబేట్ కిం ద రాష్ర్టం నుంచి  2011-12 సంవత్సరానికి రూ.20 లక్షలు, 2012-13 సంవత్సరానికి రూ.25 లక్షలు, కేంద్రం నుంచి 2012-13 సంవత్సరానికి సంబంధించి రూ.25 లక్షలు విడుదల కావాల్సి ఉంది. వీటికి తోడు నూలు రిబేట్‌పై రాష్ర్టం నుంచి జిల్లాలోని సంఘాలకు రూ.3.5 కోట్లకు పైగానే రావలసి ఉంది. ఇక అమ్మకాలకు సంబంధించి ఆప్కో నుంచి చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయి మొత్తం రూ.8 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement