తొలగింపులపై తిరుగుబావుటా
ఎమ్మిగనూరు రూరల్: స్మార్ట్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆందోళనకు కారణమవుతోంది. ఎమ్మిగనూరు మండలంలో ఒక్క జూన్ నెలలోనే 410 పింఛన్లను తొలగించడంతో బాధితులు రోడ్డెక్కారు. సోమవారం గుడేకల్ గ్రామానికి చెందిన 170 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు సోమప్ప సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. పింఛన్లను పునరుద్ధరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు.
వీరికి వివిధ ప్రజా సంఘాల నేతలు రాముడు, జబ్బార్ మద్దతు పలికారు. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోగా.. ఏకంగా తొలగించడం పట్ల వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్‌ఐలు ఇంతియాజ్‌బాషా, నల్లప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వారు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీడీఓ పద్మజ అక్కడికి చేరుకుని పింఛన్లను పునరుద్ధరించే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పడంతో బాధితులు శాంతించారు.