జరీబు భూముల్ని వదులుకోం! | capital - farmer conference in farmers | Sakshi
Sakshi News home page

జరీబు భూముల్ని వదులుకోం!

Published Fri, Nov 21 2014 1:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

జరీబు భూముల్ని వదులుకోం! - Sakshi

జరీబు భూముల్ని వదులుకోం!

* మా జోలికి రావద్దు
* బాబు మాటలు నమ్మలేం..
* ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోండి
* అన్నదాత కన్నెర్ర జేస్తే పతనం తప్పదు
* ‘రాజధాని-రైతు’ సదస్సులో స్పష్టం చేసిన రైతులు
బంగారం పండే జరీబు భూములను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోబోమని రైతులు తేల్చి చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోమని ప్రభుత్వానికి సూచించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్రేలేని చంద్రబాబు మాటలు నమ్మలేమని, బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.

అన్నదాత కన్నెర జేస్తే ప్రభుత్వాల పతనం తప్పదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ‘రాజధాని-రైతు’ అంశంపై చర్చావేదిక నిర్వహించారు. గుంటూరు నగరంలోని వైన్ డీలర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మెజారిటీ సంఖ్యలో రైతులు భూములిచ్చేందుకు నిరాకరించగా కొద్దిమంది సుముఖత వ్యక్తం చేశారు.
 - అరండల్‌పేట (గుంటూరు)
 
 రైతు జోలికొస్తే మట్టికరవాల్సిందే!
 రైతేరాజు అన్న చంద్రబాబు పచ్చని పంట పొలాలను లాక్కోవడం సమంజసం కాదు. పంటలు పండించి, అన్నం పెట్టే రైతుల జోలికి వస్తే ఎంతటివారైనా మట్టికరవక తప్పదు. తుళ్ళూరు రాజధాని అయితే ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం కూడా ఉంది. పచ్చని పొలాలపై చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెబుతుంది.
 -ప్రసాదరావు
 
కంటి  మీద కునుకు లేదు..
రాజధాని తమ భూముల్లో నిర్మిస్తామని చెప్పిన నాటి నుంచి కంటిమీద కనుకు లేదు. అసలు ప్రభుత్వం ఒక విధివిదానం అంటూ ప్రకటించలేదు. రైతులకు ఎన్ని గజాలు భూమి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు, చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు అన్నదానిపై స్పష్టత లేదు. అన్నీ తెలిసిన చంద్రబాబు ఈ విషయంలో రహస్యం ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదు.
 - కోట శ్రీనివాసరావు, యర్రబాలెం
 
30 వేల ఎకరాలు ఎందుకో..?
రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు ఎందుకో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరిలో అనేక ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయి. అక్కడ రాజధాని నిర్మిస్తే నేషనల్ హైవేకు రైలు మార్గం, అన్ని ఉంటాయి.  సింగపూర్‌కి.. ఇక్కడ పరిస్థితులకు భౌగోళికంగా ఎంతో తేడా ఉంది. పది రకాల కూరగాయలు పండించే తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు.
 - శంకర్‌రెడ్డి, ఉండవల్లి
 
ప్రభుత్వంపై నమ్మకం లేదు..
రాజధానికి భూములు ఇవ్వమని కోరడంతో ఇక్కడి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తరతరాలుగా భూములతో ఇక్కడి రైతులు అనుబంధాలు పెంచుకున్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేక, రుణమాఫీ అమలు చేయకపోవడంతో భయపడి రైతులు ఇప్పటి వరకు 3,500 ఎకరాలు అమ్మారు. ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటో ఇక్కడి రైతులకు తెలియదు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
- గాంధీ, లింగాయపాలెం, రైతు
 
మాట్లాడే అవకాశం ఇవ్వలేదు..
నేను టీడీపీ కార్యకర్తను. రాజధానికి భూములు ఇచ్చేందుకు 99 శాతం రైతులు సముఖంగా ఉన్నారని కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రకటించారు. మమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయినా అక్కడ ఆయన మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. మాకు ఏం చేస్తారో కూడా స్పష్టంగా చెప్పలేదు. మా గ్రామానికి చెందిన ఒక్క రైతు కూడా మాట్లాడలేదు. కేవలం ఎమ్మెల్యే చెప్పిన వారికే అవకాశం ఇచ్చారు.
- మధుబాబు, పెనుమాక
 
రైతును రైతులా ఉంచండి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని సింగపూర్‌లా అవసరం లేదు. అక్కడ కాఫీ రూ.300, క్రాఫ్ చేయించుకోవాలంటే రూ.వెయ్యి అవుతుంది. అంత ఖర్చు చేయలేం. హైదరాబాద్‌లా చారు. రెండు సమోసాలు, ఒక టీ రూ.50తో అయిపోతుంది. రైతులను పారిశ్రామిక వేత్తలను చేయనవసరం లేదు. రైతును రైతులా ఉంచితే చాలు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఇంత భూమి సేకరణ చేస్తున్నారు. మంగళగిరి వద్ద ఖాళీగా ఉన్న భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి.
- చలమారెడ్డి
 
బాబు హామీల్ని ఎలా నమ్మాలి?
రైతుల్లో చాలా మందికి అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న భూములు ఇచ్చి ఏం చేయాలి. అలాగే రైతు రుణమాఫీ అన్న చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు, ప్రభుత్వంపై నమ్మకం లేదు. మనం కొనుక్కునే ఇసుకకు ముందే డబ్బులు చెల్లించాలి. కాని రైతులు ఇచ్చే భూములకు ముందు డబ్బులు చెల్లించరా.. అసలు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు.
 -కోటిరెడ్డి, పెనుమాక
 
ఇలాగే బతకనివ్వండి..
మాది సస్యశ్యామలమైన గ్రామం. మల్లెలు, జాజులు, కూరగాయలు పంటలు పండిస్తున్నాం. మా భూములు రాజధానికి ఇచ్చే ప్రసక్తే లేదు. మాకు సింగపూర్ సిటీలు వద్దు. మాకు ఇక్కడ మూడు పంటలు పండుతాయి. హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇలాగే ఉండనివ్వండి          - అంజమ్మ, నిడమర్రు
 
భూములిస్తే ఎలా బతకాలి?
ఐదువేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించుకోవచ్చని కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నాయకులే చెబుతున్నారు. మంగళగిరి వద్ద ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి. భూములు ఇచ్చిన రైతు ఎలా బతకాలి. పదేళ్లలో రేట్లు పెరగవచ్చు. అప్పుడు రైతు ఎలా జీవనం సాగించాలి. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదు.
-సింహాద్రి లక్ష్మారెడ్డి, కాజ, రైతుకూలీ సంఘం
 
బలవంత పెట్టొద్దు..
 ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌పై తీసుకువచ్చే ఆర్డినెన్స్ లేదా చట్టంలో భూములు ఇవ్వని వారి నుంచి బలవంతంగా తీసుకోము అన్న అంశం చేర్చాలి. మేము ఇక్కడ చాలా అభివృద్ధి చెంది ఉన్నాం. ఇక్కడ పండే పంటలతో మా కుటుంబాలను పోషించుకుంటాం. మాది అభివృద్ధి చెందిన ప్రాంతం. సీఎం ఇచ్చే వెయ్యి గజాల స్థలం మాకు వద్దు. మా భూముల జోలికి రావద్దు.
- నరేష్‌రెడ్డి, ఉండవల్లి
 
ఎకరం భూమి అమ్ముకున్నా..
నాకు పది ఎకరాల భూమి ఉంది. రాజధాని ప్రకటించక ముందు ఇక్కడ ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ధర ఉంది. ఇప్పుడు ఎకరా 1.40 కోట్లు. దీంతో నేను ఎకరం భూమి అమ్ముకున్నాను. గత ఏడాది పంట నష్టం వచ్చి అప్పుల పాలయ్యాను. రాజధానికి భూములు ఇచ్చేందుకు నేను సిద్ధం.
-కోట అప్పారావు, తుళ్లూరు
 
పరిహారం సరిపోదు..
రైతు సమస్యలపై విస్తృతంగా చర్చించాలి. రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాజధానికి భూములు ఇచ్చే రైతుల హక్కులను కాపాడాలి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదు. సరైన నిబంధనలను ప్రకటిస్తే భూములు ఇస్తాం.
-చనుమోలు రమేష్, తుళ్లూరు
 
పచ్చని పంటలు పాడుచేయొద్దు..
హుదూద్ తుపాను ప్రభావంతో పచ్చదనం మొత్తం పోయింది. ఇప్పుడు రాజధాని పేరుతో ఇప్పుడు పచ్చని పంట పొలాలను నాశ నం చేయవద్దు. మనిషి తన అభివృద్ధి కోసం, రాజధాని పేరుతో గ్రీనరీని పాడుచేయవద్దు. రాజధాని కోసం భూములు బలవంతంగా సేకరించడం సమర్ధనీయం కాదు.
- చిన్నపరెడ్డి, వుయ్‌కేర్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రతినిధి
 
భూమి లాక్కుంటే సహించం..
రాజధాని కోసం 29 గ్రామాల్లో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇష్టం ఉన్న రైతులు భూములను ఇవ్వవచ్చు. ఇష్టం లేని వారి నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదు. రాజధానికి భూముల అవసరం చంద్రబాబుకు ఉంది. ఆయన వద్దకు రైతులు వెళ్లి చులకన అయ్యారు. రైతులు వెళ్లకుండా ఉండాల్సి ఉంది.
 -మేరిగ విజయలక్ష్మి, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement