Capital-Farmer Conference
-
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సర్కారు
* ‘రాజధాని - రైతు’ చర్చావేదికలో ధ్వజమెత్తిన అన్నదాతలు * ప్రజాభిప్రాయం తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి * చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలి * విజయవాడ, గుంటూరు నగరాల్లో ఖాళీగా ఉన్న భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి * భూములిచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు సిద్ధంగా ఉన్నారన్న నేతలు సాక్షి, గుంటూరు: ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయం సేకరించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పలువురు వక్తలు, రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని అరండల్పేటలోగల ఒక కల్యాణమండపంలో గురువారం ‘రాజధాని-రైతు’ అంశంపై ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ నేతృత్వంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు, రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో రైతులను గందరగోళంలోకినెట్టి భూసమీకరణ జరపాలని చూడడం సమంజసం కాదని, రాజధానిగా మారిన తరువాత వచ్చే ఇబ్బందులు ముందుగానే గ్రహించి చర్యలు చేపట్టాలని, అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం కల్పించేలా ముఖ్య కార్యాలయాలు, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చూడాలని ఈ సందర్భంగా తీర్మానించారు. రాజధాని ఎన్ని ఎకరాల్లో నిర్మాణం అవుతుందో, రైతులకు ఎలాంటి ప్యాకేజీలు ఇస్తారో వెల్లడించాలనీ, చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలని తీర్మానించారు. ఒకవైపు విద్యుత్ కాలుష్యం, మరోవైపు రాజధాని కాలుష్యం కృష్ణా నదిలో కలిస్తే పర్యావరణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వం నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజధాని నిర్మించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఎక్కువ మంది రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండటంతో అనుకూలంగా రైతులు అభిప్రాయం వెల్లడించినప్పుడల్లా కొంతసేపు గందరగోళం నెలకొంది. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి కలుగజేసుకొని చర్చావేదికలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని, వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగవద్దంటూ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం, భూ సమీకరణపై రైతుల్లో అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయని చెప్పారు. భూమిని సమీకరించాల్సి వస్తే వాటిని కోల్పోయేవారితోపాటు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి కూడా నష్టం జరగకుండా ఉండేందుకు 2012లో భూసేకరణచట్టం తయారు చేసి 2014 జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చారని చెప్పారు. రాజధాని అవసరం ఎంత ఉందో, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూములిచ్చేందుకు రైతులు సిద్ధం రైతులకు, భూములకు గతంలో ఉన్న అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదని, చాలామంది వ్యవసాయాన్ని వదిలిపెట్టేందుకు, రాజధాని నిర్మాణానికి సుముఖంగా ఉన్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. తుళ్ళూరు మండలంలో పంటలు పండక అనేకమంది రైతులు అప్పుల పాలయ్యారని, ఈ నేపథ్యంలో రాజధానికి భూములు ఇచ్చేందుకు అనేక గ్రామాల ప్రజలు అంగీకారం తెలిపారని తుళ్ళూరు మండల రైతు సంఘ నాయకుడు పువ్వాడ సుధాకర్ చెప్పారు. మరో రైతు నాయకుడు జొన్నలగడ్డ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తాము రాజధానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఫలం అందిస్తుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చావేదికలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పలువురు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, పలు చేతి వృత్తుల వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని తరలిస్తే గ్రామం తరఫున రూ.25 కోట్లు ఇస్తాం ఇక్కడ సింగపూర్ వంటి నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అటువంటిది ఏమీ వద్దు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే మా గ్రామం తరఫున రూ. 25 కోట్లు చంద్రబాబుకు ఇస్తాం. మేము ఇక్కడ పది రకాల పంటలు పండిస్తున్నాం. హాయిగా జీవిస్తున్నాం. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ బలవంతంగా భూములు లాక్కొని రాజధాని నిర్మించాలంటే మా శవాలమీద కట్టుకోమనండి. - బత్తుల జయలక్ష్మి, మహిళా రైతు, నిడమర్రు భూసమీకరణపై మంత్రులు తలోమాట: శివాజీ మంత్రులు భూసమీకరణపై తలా ఒక మాట మాట్లాడుతున్నారని, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదని ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేసి రైతుల భూమిని సమీకరించేందుకు చూస్తున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో 10 లక్షల అడుగుల భవనాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి నడపవచ్చని సూచించారు. విజయవాడ నగరాన్ని రాజధాని చేస్తామంటూ చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదని, కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రైతు సంఘం నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన భూమిగా పేరొందిన భూములను రాజధానికి తీసుకోవడం సరికాదన్నారు. అభిప్రాయం చెప్పేందుకు సీఎం వద్దకు వెళుతున్న రైతులను బస్సుల్లో నుంచి దింపడం, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం మంచిది కాదని డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. కొందరు మంత్రులు కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరన్నట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి మండిపడ్డారు. -
చట్టం తరువాతే భూ సమీకరణ
* రాజధాని నిర్మాణంపై ఏకపక్షం తగదు * ఖాళీగా ఉన్న భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి * ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి * ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించుకోవచ్చు * ఇవీ ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ‘రాజధాని-రైతు’ చర్చావేదికలో వెల్లడైన భిన్నాభిప్రాయాలు సాక్షి, గుంటూరు:రాజధాని నిర్మాణం ఎన్ని ఎకరాల్లో చేపడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు, సమీకరణలో భూములు ఇచ్చే రైతులకు ఎలాంటి ప్యాకేజీలు ఇలా అన్ని విషయాలు చర్చించి చట్టం చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలని ఎక్కువ మంది రైతులు, వక్తలు అభిప్రాయపడ్డారని ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ తెలిపారు. గుంటూరు అరండల్పేటలోనివైన్ డీలర్స్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ‘రాజధాని - రైతు’ చర్చావేదిక ముగింపులో ఆయన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి తీర్మానం చేశారు. ఆ వివరాలు.. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదని, ప్రజాభి ప్రాయం సేకరించి, నిర్మాణం చేపట్టాలని కోరారు. * హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ ఏ విధంగా అయితే కలుషితమవుతుందో, రానున్న రోజుల్లో కృష్ణానది కూడా అదే విధంగా కలుషితం కానుందని, దీని వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. * కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. * ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని నూతన రాజధాని నిర్మించేలా ఫ్యాక్ట్ సంస్థ మరిన్ని చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ వెల్లడించారు. * మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన చర్చా కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు, కూలీలు, కౌలురైతులు, వివిధ వర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. * వేదికపై ఉన్న వక్తలు, హాజరైన వివిధ వర్గాలు వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. * రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తే నిడమర్రు గ్రామం నుంచి రూ. 25 కోట్లు వసూలు చేసి ఇస్తామని బత్తుల జయలక్ష్మి అనే మహిళ రైతు ప్రకటించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. * కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సాక్షి’ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ‘కొత్తరాజధాని నిర్మాణం - భూ సమీకరణ’ అనే అంశంపై క్రియాశీల, విశ్లేషణాత్మక చర్చ జరగాలని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వం పారదర్శక నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కోరారు. * రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల్లో 21వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అందులో రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. * వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎలా జరుపుతారో మాస్టర్ ప్లాన్ చూపాలన్నారు. * మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి మాట్లాడుతూ అఖిల పక్షకమిటి వేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా పార్టీలు, ప్రజలను అవమాన పరచడమేనన్నారు. * కృష్ణా, డెల్టా పరిరక్షణ కమిటీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. * ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ 93 శాతం మంది రాజధాని ఇష్టమేనని చెబుతున్నారని, పరిహారం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నష్టాల వల్లే భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం.. తుళ్లూరు మండలంలో సరిగాపండని భూములూ ఉన్నాయి. పంటల్లో నష్టం వాటిల్లడం వల్ల అప్పుల పాలై రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం. - పువ్వాడ సుధాకర్, రైతు నాయకులు ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఫలం ఇస్తుందో తెలుసుకుంటాం.. ఖరీదైన భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. పంటలు సరిగా పండని గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. భూములు తీసుకున్న తరువాత రైతులకు ప్రభుత్వం ఏమేరకు పరిహారం అందిస్తుందో తెలుసుకునేందుకే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నా. -
జరీబు భూముల్ని వదులుకోం!
* మా జోలికి రావద్దు * బాబు మాటలు నమ్మలేం.. * ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోండి * అన్నదాత కన్నెర్ర జేస్తే పతనం తప్పదు * ‘రాజధాని-రైతు’ సదస్సులో స్పష్టం చేసిన రైతులు బంగారం పండే జరీబు భూములను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోబోమని రైతులు తేల్చి చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోమని ప్రభుత్వానికి సూచించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్రేలేని చంద్రబాబు మాటలు నమ్మలేమని, బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. అన్నదాత కన్నెర జేస్తే ప్రభుత్వాల పతనం తప్పదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ‘రాజధాని-రైతు’ అంశంపై చర్చావేదిక నిర్వహించారు. గుంటూరు నగరంలోని వైన్ డీలర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మెజారిటీ సంఖ్యలో రైతులు భూములిచ్చేందుకు నిరాకరించగా కొద్దిమంది సుముఖత వ్యక్తం చేశారు. - అరండల్‌పేట (గుంటూరు) రైతు జోలికొస్తే మట్టికరవాల్సిందే! రైతేరాజు అన్న చంద్రబాబు పచ్చని పంట పొలాలను లాక్కోవడం సమంజసం కాదు. పంటలు పండించి, అన్నం పెట్టే రైతుల జోలికి వస్తే ఎంతటివారైనా మట్టికరవక తప్పదు. తుళ్ళూరు రాజధాని అయితే ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం కూడా ఉంది. పచ్చని పొలాలపై చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెబుతుంది. -ప్రసాదరావు కంటి మీద కునుకు లేదు.. రాజధాని తమ భూముల్లో నిర్మిస్తామని చెప్పిన నాటి నుంచి కంటిమీద కనుకు లేదు. అసలు ప్రభుత్వం ఒక విధివిదానం అంటూ ప్రకటించలేదు. రైతులకు ఎన్ని గజాలు భూమి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు, చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు అన్నదానిపై స్పష్టత లేదు. అన్నీ తెలిసిన చంద్రబాబు ఈ విషయంలో రహస్యం ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదు. - కోట శ్రీనివాసరావు, యర్రబాలెం 30 వేల ఎకరాలు ఎందుకో..? రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు ఎందుకో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరిలో అనేక ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయి. అక్కడ రాజధాని నిర్మిస్తే నేషనల్ హైవేకు రైలు మార్గం, అన్ని ఉంటాయి. సింగపూర్‌కి.. ఇక్కడ పరిస్థితులకు భౌగోళికంగా ఎంతో తేడా ఉంది. పది రకాల కూరగాయలు పండించే తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు. - శంకర్‌రెడ్డి, ఉండవల్లి ప్రభుత్వంపై నమ్మకం లేదు.. రాజధానికి భూములు ఇవ్వమని కోరడంతో ఇక్కడి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తరతరాలుగా భూములతో ఇక్కడి రైతులు అనుబంధాలు పెంచుకున్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేక, రుణమాఫీ అమలు చేయకపోవడంతో భయపడి రైతులు ఇప్పటి వరకు 3,500 ఎకరాలు అమ్మారు. ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటో ఇక్కడి రైతులకు తెలియదు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. - గాంధీ, లింగాయపాలెం, రైతు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. నేను టీడీపీ కార్యకర్తను. రాజధానికి భూములు ఇచ్చేందుకు 99 శాతం రైతులు సముఖంగా ఉన్నారని కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రకటించారు. మమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయినా అక్కడ ఆయన మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. మాకు ఏం చేస్తారో కూడా స్పష్టంగా చెప్పలేదు. మా గ్రామానికి చెందిన ఒక్క రైతు కూడా మాట్లాడలేదు. కేవలం ఎమ్మెల్యే చెప్పిన వారికే అవకాశం ఇచ్చారు. - మధుబాబు, పెనుమాక రైతును రైతులా ఉంచండి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని సింగపూర్‌లా అవసరం లేదు. అక్కడ కాఫీ రూ.300, క్రాఫ్ చేయించుకోవాలంటే రూ.వెయ్యి అవుతుంది. అంత ఖర్చు చేయలేం. హైదరాబాద్‌లా చారు. రెండు సమోసాలు, ఒక టీ రూ.50తో అయిపోతుంది. రైతులను పారిశ్రామిక వేత్తలను చేయనవసరం లేదు. రైతును రైతులా ఉంచితే చాలు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఇంత భూమి సేకరణ చేస్తున్నారు. మంగళగిరి వద్ద ఖాళీగా ఉన్న భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి. - చలమారెడ్డి బాబు హామీల్ని ఎలా నమ్మాలి? రైతుల్లో చాలా మందికి అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న భూములు ఇచ్చి ఏం చేయాలి. అలాగే రైతు రుణమాఫీ అన్న చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు, ప్రభుత్వంపై నమ్మకం లేదు. మనం కొనుక్కునే ఇసుకకు ముందే డబ్బులు చెల్లించాలి. కాని రైతులు ఇచ్చే భూములకు ముందు డబ్బులు చెల్లించరా.. అసలు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. -కోటిరెడ్డి, పెనుమాక ఇలాగే బతకనివ్వండి.. మాది సస్యశ్యామలమైన గ్రామం. మల్లెలు, జాజులు, కూరగాయలు పంటలు పండిస్తున్నాం. మా భూములు రాజధానికి ఇచ్చే ప్రసక్తే లేదు. మాకు సింగపూర్ సిటీలు వద్దు. మాకు ఇక్కడ మూడు పంటలు పండుతాయి. హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇలాగే ఉండనివ్వండి - అంజమ్మ, నిడమర్రు భూములిస్తే ఎలా బతకాలి? ఐదువేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించుకోవచ్చని కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నాయకులే చెబుతున్నారు. మంగళగిరి వద్ద ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి. భూములు ఇచ్చిన రైతు ఎలా బతకాలి. పదేళ్లలో రేట్లు పెరగవచ్చు. అప్పుడు రైతు ఎలా జీవనం సాగించాలి. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదు. -సింహాద్రి లక్ష్మారెడ్డి, కాజ, రైతుకూలీ సంఘం బలవంత పెట్టొద్దు.. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌పై తీసుకువచ్చే ఆర్డినెన్స్ లేదా చట్టంలో భూములు ఇవ్వని వారి నుంచి బలవంతంగా తీసుకోము అన్న అంశం చేర్చాలి. మేము ఇక్కడ చాలా అభివృద్ధి చెంది ఉన్నాం. ఇక్కడ పండే పంటలతో మా కుటుంబాలను పోషించుకుంటాం. మాది అభివృద్ధి చెందిన ప్రాంతం. సీఎం ఇచ్చే వెయ్యి గజాల స్థలం మాకు వద్దు. మా భూముల జోలికి రావద్దు. - నరేష్‌రెడ్డి, ఉండవల్లి ఎకరం భూమి అమ్ముకున్నా.. నాకు పది ఎకరాల భూమి ఉంది. రాజధాని ప్రకటించక ముందు ఇక్కడ ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ధర ఉంది. ఇప్పుడు ఎకరా 1.40 కోట్లు. దీంతో నేను ఎకరం భూమి అమ్ముకున్నాను. గత ఏడాది పంట నష్టం వచ్చి అప్పుల పాలయ్యాను. రాజధానికి భూములు ఇచ్చేందుకు నేను సిద్ధం. -కోట అప్పారావు, తుళ్లూరు పరిహారం సరిపోదు.. రైతు సమస్యలపై విస్తృతంగా చర్చించాలి. రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాజధానికి భూములు ఇచ్చే రైతుల హక్కులను కాపాడాలి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదు. సరైన నిబంధనలను ప్రకటిస్తే భూములు ఇస్తాం. -చనుమోలు రమేష్, తుళ్లూరు పచ్చని పంటలు పాడుచేయొద్దు.. హుదూద్ తుపాను ప్రభావంతో పచ్చదనం మొత్తం పోయింది. ఇప్పుడు రాజధాని పేరుతో ఇప్పుడు పచ్చని పంట పొలాలను నాశ నం చేయవద్దు. మనిషి తన అభివృద్ధి కోసం, రాజధాని పేరుతో గ్రీనరీని పాడుచేయవద్దు. రాజధాని కోసం భూములు బలవంతంగా సేకరించడం సమర్ధనీయం కాదు. - చిన్నపరెడ్డి, వుయ్‌కేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి భూమి లాక్కుంటే సహించం.. రాజధాని కోసం 29 గ్రామాల్లో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇష్టం ఉన్న రైతులు భూములను ఇవ్వవచ్చు. ఇష్టం లేని వారి నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదు. రాజధానికి భూముల అవసరం చంద్రబాబుకు ఉంది. ఆయన వద్దకు రైతులు వెళ్లి చులకన అయ్యారు. రైతులు వెళ్లకుండా ఉండాల్సి ఉంది. -మేరిగ విజయలక్ష్మి, గుంటూరు