* రాజధాని నిర్మాణంపై ఏకపక్షం తగదు
* ఖాళీగా ఉన్న భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
* ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి
* ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించుకోవచ్చు
* ఇవీ ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ‘రాజధాని-రైతు’ చర్చావేదికలో వెల్లడైన భిన్నాభిప్రాయాలు
సాక్షి, గుంటూరు:రాజధాని నిర్మాణం ఎన్ని ఎకరాల్లో చేపడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు, సమీకరణలో భూములు ఇచ్చే రైతులకు ఎలాంటి ప్యాకేజీలు ఇలా అన్ని విషయాలు చర్చించి చట్టం చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలని ఎక్కువ మంది రైతులు, వక్తలు అభిప్రాయపడ్డారని ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ తెలిపారు.
గుంటూరు అరండల్‌పేటలోనివైన్ డీలర్స్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ‘రాజధాని - రైతు’ చర్చావేదిక ముగింపులో ఆయన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి తీర్మానం చేశారు. ఆ వివరాలు.. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదని, ప్రజాభి ప్రాయం సేకరించి, నిర్మాణం చేపట్టాలని కోరారు.
* హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ ఏ విధంగా అయితే కలుషితమవుతుందో, రానున్న రోజుల్లో కృష్ణానది కూడా అదే విధంగా కలుషితం కానుందని, దీని వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు.
* ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని నూతన రాజధాని నిర్మించేలా ఫ్యాక్ట్ సంస్థ మరిన్ని చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ వెల్లడించారు.
* మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన చర్చా కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు, కూలీలు, కౌలురైతులు, వివిధ వర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.
* వేదికపై ఉన్న వక్తలు, హాజరైన వివిధ వర్గాలు వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
* రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తే నిడమర్రు గ్రామం నుంచి రూ. 25 కోట్లు వసూలు చేసి ఇస్తామని బత్తుల జయలక్ష్మి అనే మహిళ రైతు ప్రకటించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
* కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సాక్షి’ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ‘కొత్తరాజధాని నిర్మాణం - భూ సమీకరణ’ అనే అంశంపై క్రియాశీల, విశ్లేషణాత్మక చర్చ జరగాలని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వం పారదర్శక నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కోరారు.
* రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల్లో 21వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అందులో రాజధాని నిర్మించుకోవచ్చన్నారు.
* వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎలా జరుపుతారో మాస్టర్ ప్లాన్ చూపాలన్నారు.
* మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి మాట్లాడుతూ అఖిల పక్షకమిటి వేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా పార్టీలు, ప్రజలను అవమాన పరచడమేనన్నారు.
* కృష్ణా, డెల్టా పరిరక్షణ కమిటీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ 93 శాతం మంది రాజధాని ఇష్టమేనని చెబుతున్నారని, పరిహారం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
నష్టాల వల్లే భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం.. తుళ్లూరు మండలంలో సరిగాపండని భూములూ ఉన్నాయి. పంటల్లో నష్టం వాటిల్లడం వల్ల అప్పుల పాలై రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం.
- పువ్వాడ సుధాకర్, రైతు నాయకులు
ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఫలం ఇస్తుందో తెలుసుకుంటాం.. ఖరీదైన భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. పంటలు సరిగా పండని గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. భూములు తీసుకున్న తరువాత రైతులకు ప్రభుత్వం ఏమేరకు పరిహారం అందిస్తుందో తెలుసుకునేందుకే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నా.
చట్టం తరువాతే భూ సమీకరణ
Published Fri, Nov 21 2014 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement