సీమాంధ్రలో నేటి నుంచి కేంద్ర కమిటీ పర్యటన
హైదరాబాద్/విశాఖపట్నం: సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం విశాఖపట్నం చేరుకుంది. కమిటీ సభ్యులు రతిన్‌రాయ్, ఆరోమర్‌రేవి, జగన్‌షా, ప్రొఫెసర్ రవీంద్రన్‌లతో కూడిన ఈ బృందం విమానాశ్రయం నుంచి నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లిన వెంటనే కసరత్తు ప్రారంభించింది. జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ సుమారు గంట పాటు స్థానిక పరిస్థితులను వారికి వివరించారు. జిల్లాలో పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(పీసీపీఐఆర్), సెజ్‌ల స్థితిగతులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులు, గిరిజన ప్రాంతాలు, రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులు, కొత్త లేఅవుట్ల వివరాలను ఆరా తీశారు.
నగర భౌగోళిక పరిస్థితులతో పాటు జీవీఎంసీ ఆర్థిక స్థితి, ఇంటి పన్నులు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టు, 13వ ఆర్థిక సంఘం నిధులు వంటి అంశాలను కమిటీ సభ్యులకు కమిషనర్ వివరించారు. కాగా, స్థానిక ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా కమిటీని కలసి విశాఖను రాజధాని చేయాలంటూ వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు రాజధానిగా విశాఖకు ఉన్న అర్హతలను కమిటీ దృష్టికి తెచ్చేందుకు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటూ పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను కోరారు. కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. శనివారం మాత్రం ఈ కమిటీ సభ్యులు ఉదయం 6.30 నుంచే విశాఖలో పర్యటించనున్నారు.
ఇతర నగరాల్లోనూ పర్యటనలు: విశాఖలో పరిశీలన అనంతరం కమిటీ సభ్యులు.. ఆదివారం రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను పరిశీలిస్తారు. మరుసటి రోజు(12న) ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, వీజీటీఎం అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను పరిశీలిస్తారు. 13న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఈ అధ్యయన కమిటీ హైదరాబాద్ చేరుకుంటుంది. 14న ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్‌తో సమావేశం తర్వాత ఢిల్లీ బయల్దేరి వెళుతుంది.
12న హైదరాబాద్‌కు గోస్వామి: రాష్ట్ర విభజన ప్రక్రియను సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నారు. అధికారులతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీ, జూబ్లీహాల్‌లతోపాటు సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం ఎంపిక చేసిన లేక్‌వ్యూ అతిథి గృహాన్ని సందర్శిస్తారు.
‘రాజధాని’పై క్షేత్ర స్థాయి అధ్యయనం
Published Sat, May 10 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement